ప్రజాస్వామ్యం దేశంలో అధికారంలో ఉన్నవారిని విమర్శించడం ఎంత సహజమో, ప్రతిపక్ష నాయకులను విమర్శించడం కూడా అంతే సహజం. ప్రజాజీవితంలోని నాయకులు తమ నిర్ణయాలు, విధానాలు, పరిపాలన, రాజకీయ వైఖరి వంటి అంశాలపై తీవ్ర విమర్శలను ఎదుర్కోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే. అయితే, ఆ విమర్శ ఒక వ్యక్తి అనుసరించిన విధానాల నుంచి మొదలై అతని కులం లేదా జాతి మీదికి మళ్లినప్పుడు, అది రాజకీయ విమర్శ పరిధి దాటి సామాజిక విద్వేషానికి దారితీసే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. లౌకికవాదం భావనను చెరిపివేస్తుంది.
ఒక వ్యక్తిని విమర్శించే హక్కు రాజ్యాం గం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ లో భాగం. కానీ, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అతని మొత్తం కులాన్ని లేదా జాతిని అవమానించడం రాజ్యాంగ విలువలకు, సమానత్వ సూత్రానికి, సామాజిక సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విరుద్ధమైన చర్యగా పరిగణించాల్సి ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలకమైన రాజకీయ నాయకుడు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన నాయకత్వం, ఆయన పోషించిన పాత్ర, సబ్బండవర్ణాలను ఏకంచేసి దీర్ఘకాల రాజకీయ పోరాటం చేసిన తీరు అమోఘం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన విధానాలు, వివక్ష లేకుండా చేపట్టిన దీర్ఘకాలిక సమాజహిత కార్యక్రమాలు దేశ రాజకీయ చరిత్రలో నమోదైన వాస్తవాలు. వాటిని ఎవరూ చెరిపివేయలేరు. అయితే, రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిని విమర్శించకుండా, ఆయన కులాన్ని లేదా మొత్తం సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలు, గౌరవం, సంస్కృతికి ఏమాత్రం మంచిది కాదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో అనేక సందర్భాల్లో ‘నీ జాతి, నీ జాతి బుద్ధి, నీ జాతికి చెందిన కలుపుమొక్కలు, నేను బతికి ఉన్నంతకాలం నీ జాతి అధికారంలోకి రాదు’ వంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన విమర్శలు ఏ స్థాయికి దిగజారాయంటే ప్రతిపక్ష నాయకుల రక్తం నేలపై చల్లాలని వ్యాఖ్యలు చేశారు. బాడీషేమింగ్ డైలాగులు, తొండలు చొరగొడతాననడం, గుడ్లు పీకి గోళీలాడుతాననడం, పండబెట్టి తొక్కుతాననడం వంటి అసహ్యకరమైన, అనాగరిక డైలాగ్లు ప్రజలు, యువతకు ఏ సందేశాన్ని ఇస్తాయి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అసహనం పరిపాలన దక్షతలేమితనం, లేకితనం, సృజనలేని ఆయన నిష్క్రియాత్మక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.
భారత రాజ్యాంగం సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని అత్యున్నత విలువలుగా గుర్తించింది. ఇందులోని 14వ అధికరణం చట్టం ముందు అందరూ సమానులని పేర్కొంటున్నది. 15వ అధికరణం మతం, కులం, జాతి, లింగం, జన్మస్థలం వంటి కారణాల ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. 19 1) (ఏ) అధికరణం భావప్రకటనా స్వేచ్ఛ కల్పించినప్పటికీ, 19 (2) అధికరణం సమాజంలో శాంతి, మర్యాద, ఇతరుల హక్కుల పరిరక్షణ కోసం సహేతుకమైన పరిమితులను విధించేందుకు అనుమతిస్తుంది. అందువల్ల భావప్రకటనా స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా
అంతే ముఖ్యమైనది.
రాజకీయ నాయకుల ప్రసంగాలను సాధారణ వ్యక్తుల మాటలతో సరి పోల్చలేం. వారి మాటలు లక్షలాది మందిపై ప్రభావం చూపుతాయి. అందుకే న్యాయస్థానాలు కూడా ప్రజాప్రతినిధుల ప్రసంగాల విషయంలో అధిక బాధ్యతను ఆశిస్తుంటాయి. ఒక ముఖ్యమంత్రి లేదా ఇతర ఉన్నత పదవిలో ఉన్న నాయకుడు ఏదైనా కులాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడితే, అది కేవలం రాజకీయ వ్యాఖ్యగా మాత్రమే కాకుండా సమాజంలో విభేదాలను పెంచే అంశంగా కూడా పరిగణించే అవకాశం ఉన్నది.
భారతీయ న్యాయ సంహిత, 2023లో కూడా మతం, కులం, భాష, జన్మస్థలం లేదా ఇతర సామాజిక ఆధారాలపై వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలు చట్టంలోని సంబంధిత నిబంధనల కింద విచారణకు దారితీయవచ్చు. నేరం నిరూపితమైతే చట్టం ప్రకారం శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైన ఆదర్శవంతమైన భాషను ఉపయోగించాలని సూచించింది. రాజకీయ ప్రత్యర్థిని విమర్శించడం ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ అవి ప్రజాస్వామిక విలువతో నిండుగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కులాల మధ్య జరిగిన పోరాటం కాదు. అది ప్రాంతీయ స్వాభిమాన ఉద్యమం. ఆ ఉద్యమంలో వివిధ కులాలు, మతాలు, వర్గాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అలాంటి ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిని విమర్శించాలంటే, ఆయన విధానాలు, నిర్ణయాలు, పాలనను విమర్శించాలి. కానీ ఆయన కులాన్ని లక్ష్యంగా చేసుకుని మొత్తం సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడడం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధంగా కనిపిస్తుంది.
రాజకీయ నాయకులు తమ పదవుల గౌరవాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటనూ ప్రభుత్వ వైఖరిగా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. అందువల్ల వారి భాష మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఒక కులాన్ని లేదా జాతిని ఉద్దేశించి పదేపదే అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని బతికించదు. ప్రజా చర్చలు వాస్తవాలపై ఆధారపడాలి; అపోహలపై కాదు.
తెలంగాణ వంటి అనేక సామాజిక వైవిధ్యాలున్న రాష్ట్రంలో నాయకుల బాధ్యత ప్రజలను కులాల వారీగా విభజించడం కాదు, అందరినీ కలుపుకొని ముందుకు నడిపించడం. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు ప్రజాస్వామ్యానికి అవసరం. ఆ విమర్శ వ్యక్తి విధానాలపై ఉండాలి కానీ వ్యక్తి జన్మించిన కులం లేదా జాతిపై కాదు. వ్యక్తులు తమ చర్యలకు బాధ్యత వహిస్తారు; మొత్తం సమాజం కాదు.
ప్రజాప్రతినిధులు వాడే భాషను ఇతరులు అనుసరించే అవకాశం ఉంటుంది. వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే కేవలం పాలించడం మాత్రమే కాదు; సమాజాన్ని కలుపుకొని నడిపించడం కూడా. అందుకే ప్రజా జీవితంలో ఉన్న ప్రతీ నాయకుడు తన రాజకీయ ప్రత్యర్థిని ఎంత తీవ్రంగా విమర్శించినా, ఆ విమర్శ వ్యక్తి చర్యలు, విధానాలు, పరిపాలనకే పరిమితం కావాలి. కులం లేదా జాతిని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తుంది. సమాజంలో విభేదాలు, వైషమ్యాలకు దారితీస్తుంది. జాతి దూషణలు చేసిన నేతల జాతకాలు కూడా తలకిందులైతయ్.. తస్మాత్ జాగ్రత్త..!
(వ్యాసకర్త: సీనియర్ న్యాయవాది)
-తన్నీరు శ్రీరంగారావు