మెదక్, మే 18(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని రామాయంపేట, కుల్చారం, చిన్న శంకరంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. సోమవారం ఉదయం నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేశారు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో రైతులు మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాష్ట్రరోక నిర్వహించారు.
లారీల కొరత పేరుతో ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలించేందుకు కాంట్రాక్టర్ 15 వేల నుంచి 20,000 చెల్లిస్తేనే లారీలు పంపిస్తామని తెలుపుతున్నారని రైతుల ఆరోపించారు. లారీలకు అధనంగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని దాన్యం తరలించేందుకు అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. అలాగే పాపన్నపేట మండలంలోని మిన్పూర్ లో రైతులు ప్రధాన రోడ్డుపై లారీల కోసం ధర్నా నిర్వహించారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యం నిల్వలు ఉంటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.