మెట్పల్లి, సెప్టెంబర్27: ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన సుమారు 40 మంది బాధిత రైతులు శనివారం మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు. వానా కాలం పంట సాగులో భాగంగా రైతులు మెట్పల్లి పట్టణంలోని శ్రీలక్ష్మి సీడ్స్ దుకాణం నిర్వాహకుని వద్ద కర్నూలుకు చెందిన అగ్రిసిస్ కంపెనీ వారి అద్భుత్ (కేఎస్ఆర్వీ-136) దొడ్డు రకం వరి విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. సుమారు 200 ఎకరాల్లో ఈ విత్తనం వరి సాగు చేశారు.
కాగా ఇటీవల సుడి దోమ, తెగుళ్లు సోకి పంట తీవ్రంగా దెబ్బతింది. పరిసరాల్లో వేసి వేరే రకం విత్తనాలకు సంబంధించి ఎలాంటి తెగుళ్లు రాకపోకగా కేవలం అద్భుత్ రకానికి సంబంధించిన వరికి మాత్రమే సుడిదోమ, తెగులు సోకడంతో పంట పూర్తిగా దెబ్బతినడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని నాసిరకం విత్తనాలు ఇవ్వడం వల్లే తాము పంట నష్టపోయామని, తక్షణమే అగ్రిసిస్ కంపెనీ, విత్తనం అమ్మిన సీడ్స్ దుకాణంపై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు శాంతించి రాస్తారోకోను విరమించారు. అనంతరం తమ డిమాండ్లతో వినతిపత్రాన్ని మండల వ్యవసాయాధికారి దీపిక, ఎస్ఐ కిరణ్ కుమార్కు అందజేశారు.