ఇంటర్ కాలేజీల్లో కొద్ది రోజులుగా ‘ఆన్లైన్ క్లాస్‌ల గోల’ మొదలైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులను ఎప్‌సెట్, నీట్ లాంటి పరీక్షలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతున్నది. క్షేత్రస్థాయిలో ఒకవైపు సౌకర్యాల లేమి, మరో వైపు టైంటేబుల్ అడ్జస్ట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో డిజిటల్ క్లాస్‌లను ఎలా నిర్వహించాలో తెలియడం లేదని లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ వాపోతున్నారు. గంటపావులో ఆరేసి సబ్జెక్టులను వీక్షించడం సాధ్యం కాదని, డిజిటల్ క్లాసుల నేపథ్యంలో ప్రాక్టికల్ క్లాస్‌లకు మంగళం పాడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన చెందుతున్నారు. సాంకేతిక నైపుణ్యం పేరిట ఇంటర్మీడియెట్ బోర్డులో నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు.
జగిత్యాల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను నీట్, ఎప్‌సెట్, క్లాట్, సీఏ తదితర ప్రతిష్టాత్మకమైన కోర్సులు, ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు ఫిజిక్స్‌వాలా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంస్థ తమ ఆధీనంలో ఉన్న నిపుణులైన లెక్చరర్లతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ, ఇంగ్లిష్+తెలుగు సబ్జెక్టులను బోధించి, రికార్డు చేయించి.. అందుకు సంబంధించిన లింకును ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు పంపిస్తున్నది. అలాగే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రెసిడెన్షియల్, సోషల్, బీసీ, ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా, తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు కూడా అందిస్తున్నది.
ఈ లింకుల ఆధారంగా ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు కాలేజీల్లో ఉన్న ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను చూపించాల్సి ఉంటుంది. ఫిజిక్స్‌వాలా సంస్థ పోటీ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ఈ డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందించినట్టు చెబుతున్నది. ఇక సర్కారు కాలేజీల్లోని ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు క్లాట్ (కామన్ లా టెస్ట్), సీఏ (చార్టెడ్ అకౌంటెంట్) పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులను డిజిటల్ క్లాస్‌ల ద్వారా చెప్పించేలా నిర్ణయించింది. ఈ మేరకు రెండు నెలల క్రితమే ఫిజిక్స్ వాలా సంస్థ నుంచి లింక్‌లను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న కాలేజీలకు అందించి, డిజిటల్ తరగతులను ప్రదర్శించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలన్న ఇంటర్‌బోర్డు ఉద్దేశం మంచిదే అయినా.. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా డిజిటల్ క్లాస్‌లను రుద్దే ప్రయత్నం చేయడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడిచేవి. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతులు ఉండేవి. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 9.20 గంటలకే జూనియర్ కాలేజీలు మొదలవుతున్నాయి.
విద్యార్థులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది ఉదయం, మధ్యాహ్నం ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్‌ను నమోదు చేస్తుండగా, దీనికే చాలా సమయం వృథా అవుతున్నది. తర్వాత 45 నిమిషాల వ్యవధితో తరగతుల బోధన ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం 1.15 నుంచి 1.30 గంటల వరకు నాలుగు సబ్జెకుల బోధన పూర్తి చేస్తున్నారు. అనంతరం అరగంట లంచ్ టైమ్ ఇస్తున్నారు. తదుపరి 2 గంటల నుంచి మరో సబ్జెక్టు బోధన చేయాల్సి ఉంటుంది. 2.45గంటలకు జనరల్ సబ్జెక్టుల బోధన ముగుస్తుంది.
2.45 నుంచి 4.15 గంటల మధ్య కాలంలో డిజిటల్ క్లాస్‌లను విద్యార్థులకు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది వర్కవుట్ కావడం లేదు. బైపీసీ పిల్లలకు ఆరు సబ్జెక్టులు ఉంటాయి. అంటే ప్రతి రోజూ ఆరు సబ్జెక్టు క్లాసుల బోధన అత్యవసరం అవుతుంది. ఈ లెక్కన వారికి మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్లాసులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆరు సబ్జెక్టుల బోధన అనంతరం మిగిలే సమయం కేవలం 45 నిమిషాలు మాత్రమే. అంత తక్కువ సమయంలో డిజిటల్ క్లాసులను విద్యార్థులకు ఎలా చూపించాలో తెలియడం లేదని లెక్చరర్లు వాపోతున్నారు. కేవలం గంట రెండు గంటల వ్యవధిలో పిల్లలకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడం ఇబ్బందికరమని చెబుతున్నారు.
ప్రొజెక్టర్ల ద్వారా డిజిటల్ బోధన చేయించేందుకు అవసరమైన మౌలిక వసతులు చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కనిపించడం లేదు. ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ప్రతి కాలేజీకి నాలుగు నుంచి ఐదు ప్రొజెక్టర్ల అవసరం ఉంటుంది. అలాగే, ప్రొజెక్టర్ ఏర్పాటు చేసే గదిలో కనీసం 100 నుంచి 150 మంది విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా ఉండాలి. వివిధ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ కాలేజీల్లో కొన్ని కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ కాలేజీల్లో ప్రొజెక్టర్లు, విశాలమైన తరగతి గదులు అందుబాటులో లేవు. జగిత్యాల జిల్లాలో చూస్తే.. 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు 14 కాలేజీల్లో మాత్రమే ఒక్కో ప్రొజెక్టర్ అందుబాటులో ఉన్నవి. కథలాపూర్, మల్లాపూర్ కాలేజీల్లో ప్రొజెక్టర్ లేదు. జగిత్యాల బాలురతోపాటు మరో మూడునాలుగు కాలేజీల్లో ప్రొజెక్టర్లు చెడిపోయి పనిచేయని స్థితిలో ఉన్నాయి. చాలా జూనియర్ కాలేజీల్లో వందకు పైగా విద్యార్థులను కూర్చొబెట్టేందుకు అనువుగా ఉన్న గదులు లేవు. దీంతో జూనియర్ కాలేజీల్లో డిజిటల్ తరగతుల ప్రదర్శన ఇబ్బందికరంగా మారింది.
ఇంటర్మీడియెట్‌లోని బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత కీ లకం. 1969లో ఇంటర్మీడియెట్ విద్య ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాక్టికల్స్ వ్యవస్థ ఉన్నది. వీటికి సంబంధించి ప్రత్యేక టైంటేబుల్, రికార్డ్స్, ఫీల్డ్ విజిట్, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. థియరీ మార్కులు 60 శా తం, ప్రాక్టికల్ 40శాతం మార్కులు కాగా, విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొ టనీ, జువాలజీల్లో ప్రత్యక్ష అనుభవం కోసం ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తారు.
సైన్స్ విద్యార్థులకు మధ్యాహ్నం ఐదారు పీరియడ్స్ తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు డిజిటల్ క్లాసుల నేపథ్యంలో ప్రాక్టికల్ క్లాస్‌ల కు మంగళం పాడాల్సిన దుస్థితి నెలకొన్నదని ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. డిజిటల్ తరగతుల పుణ్యమా అని టైం టేబుల్‌ను ఎత్తివేసి, ప్రాక్టికల్స్‌కు మంగళం పాడేందుకు నిర్ణయించుకున్నారు. ఇదేజరిగితే భవిష్యత్తులో విద్యార్థి ఇంటర్పాస్ కావడంపైనే ప్రభావంచూపే పరిస్థితి ఉన్నది.