సిరిసిల్ల: నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్న సిరిసిల్ల (Sircilla) కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేతో పంచాయితీ, హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో కరెక్టర్ను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. దీంతో సిరిసిల్లలో స్థానిక నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని విద్యానగర్లో ఓ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టిన నాయకులు, పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ కాగా, అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. ఆయనను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేసింది. సందీప్ కుమార్ స్థానంలో సిరిసిల్ల కలెక్టర్గా ఎం హరితను నియమించారు. వీరితో పాటు మొత్తం ఆరుగురు ఐఏఎస్లు బదిలీ కాగా, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల కమిషనర్గా ఎం రఘునందన్ రావు బదిలీ అయ్యారు. రవాణా శాఖ కమిషనర్గా కూడా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ కమిషనర్గా కే సురేంద్ర మోహన్, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే హరిత నియామకం అయ్యారు.