Korutla | కోరుట్ల, మే 12 : ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలని అన్నదాత ఆక్రోశించాడు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్లలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని పెద్దగుండు సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు రహదారి దిగ్బంధించారు. రామారావుపల్లె, పెద్దాపూర్ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై సుమారు గంటపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కోరుట్ల-నిజామాబాద్ జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రెండు నెలల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చినా ఇప్పటివరకు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. మిల్లర్లు తప్ప,తాలు పేరిట క్వింటాలుకు పదిహేను కిలోల చొప్పున ధాన్యంలో కోత విధిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షాలతో ఎక్కడ తడిసి పోతుందనే ఆందోళనలో రైతులు కంటి మీదు కునుకు లేకుండా భయంతో ఉన్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని ప్రజావాణిలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని తెలిపారు.
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందుల గురిచేస్తున్నారని, మేము చెప్పినట్టే రైతులు వినాలని, ప్రభుత్వాన్ని నడిపేది తామేనని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను అరిగోస పెడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. మెట్పల్లి తాసిల్దార్ రైతుల ధర్నా వద్దకు చేరుకొని కొనుగోలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.