అమెరికా పోయిన మన ఆబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడి నుంచి ఒక అదిరిపోయే ఐడియాను ఎత్తుకోత్తుండు. అదేందంటే మన రాష్ట్రంలో ’వైన్ టూరిజం’ అట! ద్రాక్ష తోటలు, వైన్ తయారీ కేంద్రాలు చూపిస్తూ టూరిస్టులను ఆకర్షిస్తారట. ఈ మాట వినగానే ఇక్కడ జనాల గుండెల్లో గుబులు మొదలైంది.
’ఏంది మంత్రి సారు.. ఉన్న బతుకులతోనే జనం అల్లాడిపోతుంటే, ఈ వైన్ టూరిజం తెచ్చి ఇంకా ఎక్కువ మందుబాబులను తయారు చేయాలని చూస్తున్నారా ఏంది? మహాప్రభువులారా.. తెలంగాణను ఏదో గోవా మాదిరిగా మద్యానికి అడ్డాగా మాత్రం మార్చకండి నాయనా!’ అని
గోల పెడుతున్నరు.
ఐటీ, వ్యవసాయం, భారీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌తో రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోవాలి కానీ, అవన్నీ పక్కనపెట్టి, చివరికి రాష్ర్టాన్ని ఒక పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ లెక్క మారుస్తారా ఏంది అని మేధావులు తలలు పట్టుకుంటుండ్రు.
’వైన్ పరిశ్రమను వీలైతే కాలుష్య రహిత ఇండస్ట్రీగా చూడు సారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఊరూరా తిరిగే టూరిజంలా మార్చి, ఊళ్లలో మందు వాసనలు గుప్పించకండి’ అంటూ జనం గగ్గోలు పెడుతున్నరు.
మంత్రి అమెరికాలో ద్రాక్ష తీగలను చూసి ముచ్చటపడి ఉండొచ్చుగానీ, ఇక్కడ మనోళ్ల ఇండ్లలో మాత్రం దీపాల వెలుగులు ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైన్ టూరిజం సంగతి దేవుడెరుగు, ముందు మన ఊళ్లలో మద్యంతో బలయిపోతున్న కుటుంబాల ఏడుపులు లేకుండా చేస్తే అదే పదివేలు అంటున్నరు జనం!