విద్యార్థుల ఉద్యమం పాలకులను జవాబుదారీగా నిలబెట్టగలదు. కానీ అక్కడితో ఆగిపోతే అది రాజకీయ విజయం మాత్రమే. పరీక్షల విశ్వసనీయత నుంచి కృత్రిమ మేథ యుగానికి తగిన విద్య వరకు భారత్కు ఇప్పుడు కావాల్సింది సమగ్ర విద్యా సంస్కరణ. విద్యార్థుల ఆందోళనలు మన ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మరోసారి ముందుకు తెచ్చాయి. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఐదేండ్లకు ఎన్నుకుంటారు. కానీ ఆ ఐదేండ్లూ ప్రశ్నించకుండా పాలించాలని అధికారం అప్పగించరు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసన తెలపడం, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కూడా అదే ప్రజాస్వామ్యంలో భాగం.
విద్యార్థులు సంఘటితమై తమ సమస్యను దేశం ముందుకు తీసుకురావడం, ప్రభుత్వాన్ని స్పందించేలా చేయడం చిన్న విషయం కాదు. యువత కేవలం ఓటర్లే కాదు, ప్రజాస్వామ్యంలో క్రియాశీల భాగస్వాములని ఇటువంటి ఉద్యమాలు గుర్తుచేస్తాయి. అయితే ఉద్యమం సాధించిన రాజకీయ ఫలితం తర్వాత మరింత ముఖ్యమైన ప్రశ్న అడగాలి. దీనివల్ల మన విద్యా వ్యవస్థలో ఏం మారింది? అని. ఓ మంత్రి తన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ జవాబుదారీతనం. తప్పు చేసిన అధికారులపై చర్య తీసుకోవడం పాలకుల బాధ్యత. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిని శిక్షించడం చట్టపరమైన చర్య. పరీక్షను మళ్లీ నిర్వహించడం, కొత్త భద్రతా ఏర్పాట్లు చేయడం తక్షణ దిద్దుబాటు. ఇవన్నీ అవసరమే. కానీ ఇవే విద్యా సంస్కరణలు కావు.
అసలు సంస్కరణ అంటే ఏంటి? ఈ వైఫల్యం ఎందుకు జరిగింది? దానికి అవకాశం కల్పించేలా వ్యవస్థలోనే ఉన్న లోపం ఏమిటి? తప్పు మరోసారి జరగకుండా ఏం మార్చాం? అని ప్రశ్నించడం. వ్యక్తిని మార్చడం ఒక నిర్ణయం. వ్యవస్థ మళ్లీ అదే తప్పు చేయకుండా మార్చడం సంస్కరణ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో విద్య గురించి చర్చకు కొదవలేదు. రాధాకృష్ణన్ కమిషన్ నుంచి కొఠారీ కమిషన్ వరకు, 1968 జాతీయ విద్యా విధానం నుంచి 1986 విధానం, తదనంతర మార్పులు, విద్యాహక్కు చట్టం, చివరకు జాతీయ విద్యా విధానం 2020 వరకు అనేక ప్రయత్నాలు జరిగాయి. పాఠశాలలు విస్తరించాయి. ఉన్నత విద్య సామాన్య కుటుంబాలకు చేరువైంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం.
ఒకప్పుడు కొద్దిమందికే పరిమితమైన విద్య కోట్లాది మందికి అందుబాటులోకి వచ్చింది. ఇది స్వతంత్ర భారతదేశం సాధించిన గొప్ప సామాజిక మార్పుల్లో ఒకటి. అయినా ఒక ప్రశ్న మిగిలిపోయింది. విద్య అందుబాటులోకి వచ్చింది. కానీ విద్య స్వరూపం ఎంత మారింది? మంత్రి మారితే సరిపోతుందా? మన విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం లేదా? మనకు కొత్త విద్యా విధానాల కొరత లేదు. విధానాల్లో చెప్పిన ఆశయాలను తరగతి గదిలోకి తీసుకురావడంలోనే అసలు సమస్య ఉన్నది. చదువు పరీక్ష కోసం మాత్రమేనా? మన విద్యా వ్యవస్థలోని వైరుధ్యాన్ని కోచింగ్ సంస్కృతి స్పష్టంగా చూపుతోంది. పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు. అయినా ట్యూషన్ అవసరమవుతుంది. ఇంటర్ పూర్తవుతుంది. ప్రవేశ పరీక్షకు కోచింగ్ అవసరం.
డిగ్రీ పూర్తవుతుంది. ఉద్యోగ పరీక్షకు మరో కోచింగ్. ఒకప్పుడు విద్యార్థులు ఎంత నేర్చుకున్నారో తెలుసుకోవడానికి పరీక్ష ఉండేది. ఇప్పుడు చాలా సందర్భాల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికే చదువు సాగుతున్న పరిస్థితి ఏర్పడింది. చదివిన విషయం అర్థమైందా లేదా అనే దానికంటే ఎన్ని మార్కులు వచ్చాయన్నది ముఖ్యం. సమస్యను పరిష్కరించగలరా లేదా అనేదానికంటే ర్యాంకు ఎంత అనేది ముఖ్యమైంది. ఇలాంటి వ్యవస్థలో పరీక్షలపైనే నమ్మకం పోతే దాని ప్రభావం చాలా తీవ్రమైనది.
ఒక అధికారికి ప్రశ్నాపత్రం లీక్ కావడం పరిపాలనా వైఫల్యం కావచ్చు. కానీ రెండు సంవత్సరాలు పరీక్ష కోసం సిద్ధమైన యువకుడికి అది కేవలం ఒక పరీక్ష కాదు. అతని కాలం, కుటుంబం ఖర్చు చేసిన డబ్బు, వాయిదా వేసుకున్న అవకాశాలు, భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు.. అన్నీ దానితో ముడిపడి ఉంటాయి. అందుకే పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తప్పనిసరి.
పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తప్పనిసరి. కానీ పరీక్షా పత్రాన్ని కాపాడగలిగితే విద్యా వ్యవస్థను సంస్కరించినట్టే అనుకోవడం మరో పొరపాటు. కృత్రిమ మేథ (ఏఐ) విప్లవం వేగంగా దూసుకొస్తున్న తరుణంలో మన విద్యా వ్యవస్థ మార్పునకు సిద్ధంగా ఉన్నదా? మనం ఇంకా పరీక్షా పత్రాల భద్రత, మార్కులు, ర్యాంకులు, కోచింగ్ చుట్టూ తిరుగుతున్న సమయంలో ప్రపంచంలో మరో పెద్ద మార్పు జరుగుతున్నది. జ్ఞానాన్ని పొందే విధానాన్ని ఏఐ మార్చుతున్నది. మన విద్యా విధానంలో చాలా భాగం ఒక పాత పద్ధతిపై ఆధారపడి ఉన్నది. పాఠం చదవాలి, విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలో రాయాలి, మార్కులు పొందాలి. ఆ మార్కుల ఆధారంగా తదుపరి అవకాశం పొందాలి. కానీ ఇప్పుడు లార్జ్, లాంగ్వేజ్, మాడల్స్ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ సాధనాలు కొన్ని క్షణాల్లో ఒక పుస్తకాన్ని సంక్షిప్తంగా చెప్పగలవు. ఒక క్లిష్టమైన భావనను వివరించగలవు. భాషలను అనువదించగలవు. కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయగలవు. పెద్ద మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించగలవు.
అప్పుడు మన విద్యా వ్యవస్థ ఒక ప్రాథమిక ప్రశ్నను ఎదుర్కోవాలి. ఏఐ యుగంలో మనిషి ఏం నేర్చుకోవాలి? అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. సమాచారం సంపాదించడం కంటే దానిలో నిజమెంతో గుర్తించే వివేచనను విద్యార్థుల్లో పెంచాలి. ఏఐ ఇచ్చిన సమాధానాన్ని ఉపయోగించడం మాత్రమే కాదు, అది తప్పయితే గుర్తించగల జ్ఞానం విద్యార్థికి ఉండాలి. అందుకే ఏఐ వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడి ప్రాధాన్యం తగ్గదు, పాత్ర మారుతుంది. సమాచారం అందించే వ్యక్తి నుంచి ఆలోచించడం నేర్పే గురువుగా మారాలి. జ్ఞాపకశక్తిని కొలిచే పరీక్ష నుంచి అవగాహన, తర్కం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షించే విధానానికి వెళ్లాలి.
మన ముందు రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజు భారత విద్యా వ్యవస్థ రెండు కీలక సమస్యలను ఒకేసారి ఎదుర్కొంటున్నది. ఒకటి విశ్వసనీయత. తన భవిష్యత్తును నిర్ణయించే పరీక్షను, దాన్ని నిర్వహించే సంస్థను విద్యార్థి నమ్మగలడా? రెండోది ప్రాసంగికత. ఈ రోజు మనం పిల్లలకు నేర్పుతున్న విద్య, వారు రేపు అడుగుపెట్టబోయే ప్రపంచానికి ఉపయోగపడుతుందా? ప్రస్తుత వి ద్యార్థి ఉద్యమం మొదటి ప్రశ్నను బలంగా ముం దుకు తెచ్చింది. ఇప్పుడు రెండో ప్రశ్న దేశం ముం దుకు తీసుకురావాలి. జాతీయ విద్యా విధానం 2020లో కూడా జ్ఞాపకశక్తి ఆధారిత చదువు నుంచి అవగాహన, నైపుణ్యం, విద్య, వృత్తి విద్య వంటి అంశాల వైపు వెళ్లాలనే లక్ష్యాలు ఉన్నాయి.
ఏ విద్యా విధానానికైనా అసలు పరీక్ష ఒకటే, తరగతి గదిలో ఏం మారింది? పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు? ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు? పరీక్ష ఏ సామర్థ్యాన్ని కొలుస్తున్నది? చదువు పూర్తయ్యాక యువతలో ఏ జ్ఞానం, ఏ నైపుణ్యం, ఏ ఆలోచనా శక్తి మిగులుతున్నది? ఇవే అసలు ప్రమాణాలు. కొత్త విధానం ప్రకటించారా, కొత్త పథకానికి ఏ పేరు పెట్టారు అనేవి ముఖ్యం కాదు.
ఇటీవల విద్యార్థుల ఉద్యమం అధికారాన్ని జవాబుదారీగా నిలబెట్టగలదని చూపించడం ప్రజాస్వామ్య విజయం. కానీ పదేండ్ల తర్వాత మరో విద్యార్థి, మరో పరీక్ష, మరో లీకేజీ, మరో ఆందోళన, మరో రాజీనామా ఇదే చక్రం మళ్లీ తిరిగితే? అప్పుడు మనం వ్యక్తులను మార్చినట్టే, వ్యవస్థను కాదు. అందుకే చర్చ ఎవరు రాజీనామా చేయాలి? అనే ప్రశ్న దగ్గర ముగియకూడదు. అక్కడి నుంచి మరింత ముఖ్యమైన ప్రశ్న మొదలవ్వాలి. ‘భారత విద్యా వ్యవస్థ ఎలా మారాలి? టెక్నాలజీలో కొత్త మార్పులు వచ్చిన తరుణంలో పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉండాలి? పరీక్ష ఏం కొలువాలి? విశ్వవిద్యాలయం కేవలం డిగ్రీ ఇచ్చే సంస్థగా ఉండాలా? లేక ప్రశ్నించే, ఆలోచించే, కొత్త జ్ఞానాన్ని సృష్టించే యువతను తీర్చిదిద్దాలా? ఇవే మన ముందున్న అసలు ప్రశ్నలు.
– (వ్యాసకర్త:సీనియర్ రీసెర్చర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ వ్యవస్థాపకుడు)
రఘు చలిగంటి