మేడ్చల్, ఆగస్టు 1 : పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, గుంతలమయంగా మారిన రోడ్లు, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, అధ్వానంగా మారిన బస్టాండ్, కలుషితమవుతున్న నీటి వనరులు, వెలగని వీధి దీపాలు.. ఇలా మేడ్చల్‌లోని సమస్యలను ప్రజలు, నాయకులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ముందు ఏకరువు పెట్టారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి బాగుండేదని, కార్పొరేషన్లో సమస్యల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని పార్టీలకతీతంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేస్తే కనీసం మ్యాన్‌హోళ్ల మీద మూతలు కూడా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. వర్షాలు పడుతున్నా, బోనాల పండుగ సమీపిస్తున్నా కనీసం రోడ్లు మరమ్మతు చేయడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ‘వన్ వార్డు ఎవరి డే’ కార్యక్రమంలో భాగంగా శనివారం కమిషనర్ సృజన, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ మేడ్చల్ డివిజన్‌కు వచ్చారు. ఇందిరానగర్‌లోని అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలపై వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నర్సింహరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం -హౌజింగ్ దారిలో రోడ్డు అధ్వానంగా మారిందని, డ్రైనేజీ కోసం తవ్విన రోడ్డును తిరిగి నిర్మించకపోవడంతో వర్షాకాలంలో బురదమయంగా మారుతుందన్నారు. ఎత్తు పల్లాలు ఉన్న రోడ్డుపై వెళ్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. కిందిబస్తీ, వినాయక్‌నగర్, మార్కెట్ రోడ్డు తదితర చోట్ల రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిపారు. తుమ్మ చెరువు, పెద్ద చెరువు డ్రైనేజీ నీటితో కలుషితం అవుతున్నాయని, ఎస్టీపీని ఏర్పాటు చేసి నీరు కలుషితం కాకుండా చూడాలని కోరారు. తుమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్‌ను, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపాలిటీలో ఉండగా రూ.26వేల వేతనం పొందిన కార్మికులకు కార్పొరేషన్లో రూ.13వేలు మాత్రమే వస్తుందని తెలిపారు. పెరిగిన ధరల దృష్ట్యా వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు కమిషనర్ సృజన సమాధానమిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అనుమతులు రాగానే వేతనాలు పెంచుతామని తెలిపారు.
మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శైలజాహరినాథ్ మాట్లాడుతూ మేడ్చల్ డివిజన్ పరిధిలోని చాలా రోడ్లు గుంతలమయంగా మారాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందన్నారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. తుమ్మ చెరువు పూడిక తీసి, కలుషితం కాకుండా చూడాలని కోరారు. బీఆర్ఎస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం ఐదేళ్ల కాలంలోనే అభివృద్ధి జరిగిందని, కార్పొరేషన్‌గా మారి ఏడాది అవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని చెప్పారు. అధ్వానంగా మారిన గ్రంథాలయం, సూర్యనగర్, వినాయక్‌నగర్, ముకుంద్ థియేటర్, రాయిలాపూర్, గిర్మాపూర్ తదితర రోడ్లను బాగు చేయాలని కోరారు. గ్రంథాలయం రోడ్డులోనే పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రి ఉందని, రాయిలాపూర్, గిర్మాపూర్‌కు ఇదే దారిలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని కోరారు. వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నడికొప్పు నాగరాజు, సత్యనారాయణ, చీర్ల రమేశ్, శ్రీనివాస్ గౌడ్, మణికంఠా గౌడ్, విష్ణుచారి తదితరులు మాట్లాడుతూ చెరువులు కలుషితం కాకుండా చూడాలని, రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని, డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని, నీటి సరఫరాను పెంచాలని, కొత్త కాలనీలకు నీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని, పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్ మార్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, దోమల నియంత్రణకు చర్యకు తీసుకోవాలని, డంపింగ్ యార్డును తరలించాలని, బోర్లకు ఆధారమైన తుమ్మ చెరువు నుంచి అక్రమంగా నీటి తరలింపును అడ్డుకోవాలని, బోనాలు పండుగకు కిందిబస్తీలో అడ్డంకిగా మారిన రోడ్డును బాగు చేయాలని కోరారు. మున్సిపాలిటీ పాలకవర్గ చివరల్లో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారని, కానీ కార్యరూపం దాల్చలేదని, ఆ పనులతోపాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సధాంశు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.