వర్షాకాలంలోనూ అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు అవస్థలుపడుతున్నారు. విద్యుత్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో.. తెలియక సతమతమతమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో తాము ఎలా పనిచేసుకోవాలంటూ.. వినియోగదారులు మండిపడుతున్నారు. కరెంటు కోతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా లేక ప్రజల రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కాగా, రాఘవేంద్రనగర్‌లో నాలుగైదు గంటలు కరెంట్ పోతే.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెయింటెనెన్స్ అని చెబుతున్నారంటూ.. ఓ నెటిజన్ మండిపడ్డారు. ఐటీ హబ్‌లో ఈ సమస్య ఉండడంతో తాము ఎలా పనిచేసుకోవాలంటూ ప్రశ్నించారు . సాధారణంగా వర్షాకాలంలో ఇంత పెద్ద ఎత్తున కోతలు ఉండకపోయినా.. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో కరెంటు వినియోగం విపరీతంగా పెరగడంతో కోతలు తప్పలేదంటూ ఓ విద్యుత్ అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు.
-సిటీబ్యూరో
రాఘవేంద్రనగర్‌లో నాలుగైదు గంటలు కరెంట్ పోతే ఎందుకు అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెయింటెనెన్స్ అని చెబుతున్నారంటూ ఒక నెటిజన్ మండిపడ్డారు. ఐటీహబ్‌లో ఈ సమస్య ఉండడంతో తాము ఎలా పనిచేసుకోవాలంటూ ఆయన ప్రశ్నించారు . హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లోని సర్దార్బాగ్ ఏరియాలో రెండు నుంచి మూడు గంటల పాటు కరెంట్ లేదంటూ మరో నెటిజన్ ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్ పల్లి సెక్షన్లో గంటల తరబడి కరెంట్ పోతున్నదని, ఒకవేళ కరెంట్ వచ్చినా గంట సేపు కూడా ఉండడం లేదని చెప్పారు. అత్తాపూర్ తేజస్వినగర్లో వాతావరణంలో మార్పులు లేకున్నా కరెంట్ మాత్రం అడుగడుగునా పోతుందని, ప్రతీరోజూ చాలా కరెంట్ కోతల సమస్య ఎదుర్కొంటున్నామని మరొక నెటిజన్ ఆరోపించారు. ఇలా పెద్ద ఎత్తున కరెంట్ కోతలపై నెటిజన్లు ట్వీట్ చేశారు.
అయితే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు బాగా గాలిదుమారం వస్తే కరెంట్ పోవాలి తప్ప మిగిలిన సందర్భాల్లో పెద్దగా కోతలు ఉండవు. కానీ చినుకు పడితే చాలు కరెంట్ కోతలు ఉంటాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్తితుల్లో ఉన్నామని వారు పేర్కొన్నారు. సాధారణంగా వర్షాకాలంలో ఇంత పెద్ద ఎత్తున కోతలు ఉండకపోయినా ఈసారి ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడంతో కరెంట్ కోతలు తప్పలేదంటూ ఓ విద్యుత్ అధికారి వ్యాఖ్యానించారు. లోడ్ పెరగడంతో కొన్ని సబ్స్టేషన్లలో లోడ్ భరించలేక అప్పుడప్పుడు కోతలకు ఆస్కారం కల్పించామని, కొన్ని చోట్ల ఫీడర్లు ఆటోమేటిక్‌గా ట్రిప్ అయ్యాయని, అయితే మరమ్మతులు జరిగితే మాత్రం వెంటనే స్పందించామని ఆయన పేర్కొన్నారు. కాగా ఎల్‌నినో ప్రభావంతో జూలై చివరి వారం వరకు వర్షాలు లేకపోవడం, ఉక్కపోతతో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది.
జూలై 25న డిస్కం పరిధిలో 10,447 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, జూలై 15న 209.91 మిలియన్ యూనిట్ల గరిష్ఠ సరఫరా నమోదైంది. అదే విధంగా జూలై నెల మొత్తంలో 5701.73 మిలియన్ యూనిట్ల కరెంటును వినియోగదారులకు సరఫరా చేసినట్లు సంస్థ సీఎండీ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే జూలై నెలలో 368 పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, ఫీడర్ల బలోపేతం వంటి చర్యలను విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు. టీజీఎస్పీడీసీఎల్ జీహెచ్ఎంసీ పరిధిలో గత నెల 13న 4052 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 14వ తేదీన 84.9 మిలియన్‌యూనిట్ల వినియోగం జరిగిందని ఆయన తెలిపారు. గత సంవత్సరం కంటే ఇది సుమారు పదిశాతం ఎక్కువని, జూలై నెలలో మొత్తం 2359.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేసినట్లు ., గత సంవత్సరం కంటే ఇది 224 మిలియన్యూనిట్లు ఎక్కువని జితేశ్ పాటిల్ తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు కలగకుండా టీజీఎస్పీడీసీఎల్ అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎండీ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. మహంకాళి జాతర దగ్గర ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయానికి ప్రత్యేకంగా 315 కేవీఏ సామర్థ్యం కలిగిన ఒక డీటీఆర్ నుంచి విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, ఆలయ పరిసర ప్రాంతాలకు 500 కేవీఏ 3 డీటీఆర్లు , 315 కేవీఏ 5 డీటీఆర్లు, 160కేవీఏ ఒక ట్రాన్స్ఫార్మర్ల ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఒక మొబైల్ డీటీఆర్ కూడా సిద్ధ్దంగా ఉంచామని, ప్రతీ షిఫ్ట్‌నకు ముగ్గురు ఏఈల ఆధ్వర్యంలో 20మంది సిబ్బందిని విధుల్లో నియమించామని తెలిపారు. బోనాల ఉత్సవాల సమయంలో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని జితేశ్ పాటిల్ సూచించారు.