ఊట్కూర్ : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (Lift Irrigation ) భాగంగా పూర్తిగా భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ( Rehabilitation ) ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని నారాయణపేట ఆర్డీవో ( RDO) రామచందర్ నాయక్ ( Ramchander Naik ) అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ సర్వే పూర్తి కావడంతో శనివారం ఊట్కూర్, పులిమామిడి, ఎడవెల్లి గ్రామాల్లో ఆర్డీవో అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు.
ఓపెన్ కెనాల్, పైపులైన్, సంప్ హౌస్ నిర్మాణం కోసం భూ సేకరణ సర్వే పూర్తి చేశామని అన్నారు. ఆయా గ్రామాల్లో రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నామని, రైతుల సూచనల మేరకు మరోమారు భూ సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వ్యవసాయ భూముల విలువ బాగా పెరిగిందని వెల్లడించారు.
మార్కెట్ విలువ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు ఎకరాకు రూ. 60 లక్షల పరిహారం అందించాలని, అలాగే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, ఆర్ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్, ఏవో గణేష్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.