యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పగా, రాష్ట్ర సర్కారు రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. పక్కా ప్రణాళికలు రూపొందించి ఊరూరా అవగాహన కార్యక్రమాలు చేపట్టగా, రికార్డుస్థాయిలో వరి తగ్గింది. గతేడాది యాసంగిలో జిల్లాలో 16,391 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 4091 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ యాసంగిలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు కంది, పెసర, మినుములు, నువ్వులు, పొద్దు తిరుగుడు తదితరాలకు ప్రాధాన్యమిచ్చారు. – కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర సర్కారు రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. అధికారులు ఊరూరా చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో రైతుల్లో చైతన్యం కనిపించింది. గతేడాది జిల్లాలో యాసంగిలో వరి 16,391 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 4091 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను ఎంచుకున్నారు. జిల్లాలో గతేడాది యాసంగిలో కంది 23 ఎకరాల్లో మాత్రమే వేయగా, ఈ యాసంగిలో 216 ఎకరాల్లో సాగవుతోంది. పెసర గతేడాది 1335 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 1773 ఎకరాలు, మినుమలు గతేడాది 35 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 166 ఎకరాలు, నువ్వులు గతేడాది యాసంగిలో 32 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 106 ఎకరాలు, పొద్దు తిరుగుడు గతేడాది 16 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 100 ఎకరాల్లో సాగవుతోంది.
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగు తగ్గించి ఇతర పంటల వైపు రైతులు మొగ్గుచూపారు. నాడు జిల్లాల్లో అత్యధికంగా సాగయ్యే పంటలనే రైతులు ఈ యాసంగిలో వేసేందుకు ఆసక్తి చూపారు. ఈ యాసంగిలో మిశ్రమ పంటలకు రైతులు ప్రాధాన్యమిచ్చారు. వరి సాగు చేస్తే నష్టపోతామని భావించిన రైతులు అధికారుల సూచనల మేర కు మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు. జొన్న, గోధు మ, శనగ, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుములువంటి పంటలను మిశ్రమంగా సాగు చేశారు.
జిల్లాలో యాసంగిలో ఏటా అత్యధికంగా వరి సాగు చేసేవారు. కానీ.. ఈ ఏడాది రైతులు వైవిధ్యాన్ని కనబరిచారు. వరి సాగు కంటే ఇంతర పంటలతోనే ఆదాయమెక్కువని భావించి ఆ వైపు మళ్లారు. ఎకరం వరి సాగు చేస్తే రూ.15 వేలకు పైగా పెట్టుబడికి ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి 25 క్వింటాళ్ల వరకు వస్తుంది. క్వింటాలుకు మద్దతు ధర రూ.1888 చొప్పున విక్రయిస్తే రూ. 47,200 ఆదాయం వస్తుంది. ఖర్చులు రూ.15 వేలు తీసి వేస్తే.. రూ.32 వేల వరకు మిగులుతాయి. అదే జొన్న సాగు చేస్తే ఎకరానికి రూ. 5 వేలకు మించి ఖర్చు కాదు. దిగుబడి 20 క్వింటాళ్ల దాకా వస్తుంది. క్వింటాలుకు రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ధర పలికితే రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయముంటుంది. కంది సాగుకు ఎకరానికి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుంది. సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాలుకు రూ. 5 నుంచి రూ. 6 వేల ధర పలికినా.. రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం ఉంటుంది. పైగా శ్రమ తక్కువగా ఉంటుంది. శనగ సాగు చేస్తే ఎకరానికి రూ. 5 వేల పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. క్వింటాలుకు రూ. 5 వేలు పలికినా.. రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు ఆదాయముంటుంది.
నాకు 15 ఎకరాల భూమి ఉంది. వానకాలంలో 7 ఎకరాల్లో పత్తి, 8 ఎకరాల్లో వరి సాగు చేసిన. ఎకరానికి రూ. 40 వేలు వచ్చినయ్. ఈ యాసంగిలో వరి వేద్దామనుకున్న. అయితే కేంద్ర సర్కారోళ్లు వడ్లు కొనరని చెప్పిన్రు. సార్లు మా ఊరికొచ్చి వేరే పంటలు వేసుకోవాలని చెప్పిన్రు. అందుకే 8 ఎకరాల్లో పొద్దు తిరుగుడు వేసిన. దిగుబడి ఎలా ఉంటదో చూడాలి.
– ఇప్ప బాపు, రైతు, కల్వాడ, దహెగాం మండలం
నాకు 6 ఎకరాల పొలం ఉంది. ఏటా వానకాలంతో పాటు యాసంగిలో కూడా వరి పండించేటోన్ని. కానీ ఈ యాసంగిలో వరి తగ్గించిన. రెండున్నరెకరాల్లో వరి వేసిన. మిగతా మూడున్నర ఎకరాల్లో జొన్న వేసిన. వరి కంటే జొన్న సాగుకు పెట్టుబడి మస్తు తక్కువైంది. పనికూడా అంతగా ఉండదు. జొన్న సాగుతో మంచి లాభాలుంటాయని అధికారులు చెప్పిన్రు.
– దాదా భీమయ్య, రైతు, లగ్గాం, దహెగాం మండలం
