వనపర్తి, మే 19(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి మండలం రాజాపేట రైతు లు మంగళవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వనపర్తి-కొత్తకోట రహదారిపై అన్నదాతలు ధాన్యం బస్తాలతో వాహనాలను అడ్డం పెట్టి ఆందోళన దిగారు. 45రోజులుగా ధాన్యం కుప్పులు పోసినప్పటికీ కొనుగోలు చేయడం లేదని నిరసనగా రోడ్డుపై వరి ధాన్యంతోపాటు ఖాళీ బస్తాలకు రోడ్డుపై నిప్పుపెట్టారు. కొనుగోలు చేస్తామని చెబుతూనే రైతులకు ఇబ్బందులను కల్పిస్తున్నారన్నారు. గాలు లు, వానలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ఇంతలా కొనుగోళ్లను నిర్లక్ష్యం చేయడం ఎలా సమంజసమన్నారు. గడిచిన పదేళ్లలో ఏనాడు ఇలాంటి కష్టం లేదని, సునాయసంగా పంటలను అమ్ముకున్నామని రైతులు పేర్కొన్నారు.
కొనుగోళ్లు మొదలు పెట్టినప్పటి నుంచి ఇదే అరిగోస ఉందని, తాలుందని మిల్లర్లు రైతులను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు నెలలు కష్టపడి పంటలు పండిస్తే చివరకు ప్రభుత్వం ఇలా కొనుగోళ్లలో చెమటలు పట్టిస్తుందని, బస్తాలు లేవని, లారీలు రావడం లేదని రైతులను సతాయిస్తున్నారని అధికారుల ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత మంగళవారం రెండు లారీలు మాత్రమే వచ్చాయని, మళ్లీ ఇంతవరకు వాటి జాడ లేదన్నారు. వడ్లు ఎండకు ఎండిపోతున్నాయి..వానకు తడిసి పోతున్నాయి..కవర్లు లేవు.. తూకాలు కావు..బస్తాలు లేవు..లారీలు రావు..మేం చే యాలంటూ అధికారులను నిలదీశారు.
కొందరు పోలీసులు లాఠీలతో కనిపించిన క్రమంలో తమను ముట్టుకుంటే ఇక్కడే మంటపెట్టుకుని చస్తామంటూ రైతులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే ధర్నా సమాచారం తెలుసుకున్న తాసీల్దార్ రమేశ్‌రెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి కొనుగోళ్లను వేగవంతం చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య, ఉపసర్పంచ్ చిన్నారెడ్డి, జయరాములు, మాధవరెడ్డి, సుదర్శన్ రెడ్డి, తిరుపతయ్య, నారాయణ, మోహన్ రెడ్డి, సత్యారెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.