గజ్వేల్, మే 19: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో నిల్వ ఉన్న పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వరిధాన్యాన్ని మంగళవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు.రైతుల నుంచి పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయలేని పక్షంలో వేలాది మంది రైతులతో కలిసి రాజీవ్ రహదారి దిగ్బంధించి వంటావార్పు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పొద్దుతిరుగుడు కొనుగోలు చేయకపోవడంలో రైతులు దళారులకు క్వింటాల్‌కు రూ.1000 నష్టానికి అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులపైగా ధాన్యం నిల్వ ఉన్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. మొక్కజొన్న బస్తాలకు గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మక్కై రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు.
గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ధాన్యం ఆరబెట్టే సమయంలో ఇద్దరు రైతులు వడదెబ్బతో మృతి చెందితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, నవాజ్‌మీరా, నాయకులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, బొల్లారం ఎల్లయ్య, మద్ది రాజిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.