హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ): ఘన వ్యర్థాల నిర్వహణ ఇకపై కేవలం చెత్త సేకరణకే పరిమితం కాదని, అది పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పుల నిరోధం, సర్యులర్ ఎకానమీ(చక్రీయ ఆర్థిక వ్యవస్థ), ఉపాధి కల్పనలతో ముడిపడిన కీలక అంశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026 దేశంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని, తెలంగాణ ఈ నిబంధనల అమలులో ముందే ఉన్నదని చెప్పారు.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన ప్రారంభమైన రెండు రోజుల ‘స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0’ జాతీయ సమీక్ష సమావేశంలో భట్టి పాల్గొని రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలను వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు 9,596 ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా ట్రాక్ చేసేందుకు క్యూఆర్ కోడ్ సాంకేతికతను వాడుతున్నట్టు వెల్లడించారు.
డంప్‌యార్డులను అభివృద్ధి కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి పేర్కొన్నారు. జవహర్‌నగర్ డంప్ యార్డ్ దీర్ఘకాలిక పర్యావరణ నిర్వహణ కోసం ఐఐటీ బాంబే సలహాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆటోనగర్ బయోమైనింగ్ 40 ఎకరాల్లో పేరుకుపోయిన 22లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలలో ఇప్పటికే 30 శాతం బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా క్లియర్ చేశామని, స్వాధీనం చేసుకున్న ఈ భూమిని భవిష్యత్తులో పారులు, క్రీడా మైదానాలుగా మారుస్తామని ప్రకటించారు. జపాన్ తరహాలో మన దేశంలో కూడా ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు వ్యర్థాల వేర్పాటు, పర్యావరణ బాధ్యతలపై ఆచరణాత్మక బోధనను ప్రవేశపెట్టాలని సూచించారు.
రాష్ట్రాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ, రీసైక్లింగ్ ప్రాజెక్టుల మౌలిక సదుపాయాల కల్పనకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శా ఖ సహాయ మంత్రి తోఖన్సాహు, రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, వివిధ రాష్ట్రా ల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.