మోత్కూరు, ఏప్రిల్24: భూ భారతి చట్టంపై మోత్కూరులో గురువారం అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతులు లేక వెలవెల పోయింది. ఎమ్మెల్యే సామేల్తోపాటు కలెక్టర్ హనుమంతరావు సదస్సుకు హాజరయ్యారు. మండల రైతులు లేకుండానే అధికారులు అవగాహన సదస్సును మొక్కుబడిగా నిర్వహించారు.
అవగాహన సదస్సుకు రైతులను పిలువలేకపోయినప్పుడు ఈ సదస్సులు ఎందుకు, తమను ఎందుకు పిలిచావంటూ కలెక్టర్ హనుమంతరావు మండల ఇన్చార్జి తాసీల్దార్ ఉపేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ఇన్చార్జి తాసీల్దార్ ఉపేందర్ మండల వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకోకపోవడం వల్ల గ్రామాల్లోని రైతులకు అవగాహన సదస్సుపై సమాచారం లేకపోయింది.
అనంతరం జరిగిన సదస్సులో ఎమ్మెల్యే సామేల్, కలెక్టర్ హనుమంతరావు భూ భారతి చట్టంపై రూపొందించిన ప్రచార బ్రోచర్‌ను విడుదల చేశారు. ప్రజల, రైతులకు అవగాహన కల్పించడం కోసం బ్రోచర్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ పేలపుడి వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, పోచం జగన్, ఎండీ సమీర్, మండల ప్రత్యేకాధికారి పి.యాదయ్య, ఎంపీడీఓ బాలాజీ, నాయకులు పైళ్ల సోమిరెడ్డి, జి.లక్ష్మీనర్సింహారెడ్డి, వంగాల సత్యనారాయణ, అవిలిమల్లు, టి.సోమిరెడ్డి పాల్గొన్నారు.