రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో సమావేశమై ఫ్యూచర్‌సిటీ పేరిట తమ భూములకు ప్రభుత్వం ఎసరు పెట్టడంపై మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి దృష్ట్యా ఫ్యూచర్‌సిటీలో కలపాలని విన్నవిస్తే పట్టించుకోకుండా.. భూములు లాక్కోవాలని చూడటంపై కన్నెర్రజేశారు. ప్రాణాలు పోయినా సరే తమ భూములను ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతులు తాండ్ర రవీందర్, బండిమీది కృష్ణ, ప్రవీణ్, సందీప్‌రెడ్డి, రవి తదితర ఐదుగురితో ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
మంగళవారం మరోసారి రైతులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్టు వారు తెలిపారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, ఎమ్మెల్యే, రైతు కమిషన్ చైర్మన్లకు ముందుగా వినతిపత్రాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోల రూపంలో ఆందోళనలు ఉధృతం చేయాలని భావిస్తున్నారు. గ్రామంలో భూసేకరణ, సర్వే కోసం ఎవరూ వచ్చినా లగచర్ల మాదిరిగా తరిమికొట్టాలని, ప్రాణాలు పోయినా సెంటు భూమిని వదులుకోవద్దని మాజీ సర్పంచ్‌లు అంజయ్యయాదవ్, కృష్ణ, నాయకులు రవీందర్, యాదగిరిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పిలుపునిచ్చారు. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసేవరకు పోరాడాలని రైతులకు సూచించారు.
– యాచారం, మార్చి 17
మొండిగౌరెల్లి గ్రామ రైతులు ఆకుకూరలు, కూరగాయల సాగులో కొన్నేండ్లుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ రైతులు ఎక్కువగా పూదిన, కొత్తిమీర సాగు చేస్తుంంటారు. ఈ నేపథ్యంలో కూరగాయల సాగును పెంపొందించేందుకు ఇటీవల ఆ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మొండిగౌరెల్లిని కూరగాయల హబ్‌గా మార్చేందుకు హార్టికల్చర్, అగ్రికల్చర్ విభాగాల సహకారంతో రైతు కమిషన్ ఆధ్వర్యంలో ఇటీవల మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యచరణ అమల్లోకి రాకముందే ఫ్యూచర్ సిటీ కోసం 821.11 ఎకరాల రైతుల భూములను సేకరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పచ్చని పంటపొలాల్లో పరిశ్రమలు నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గుంట భూమినీ వదిలేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. రైతు ప్రభుత్వం అంటూనే నమ్మించి అన్నదాతల గొంతు కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాన్ని కలపాలని కోరితే కలపకుండా.. తమ భూములను లాక్కోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పట్టా, అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించగా.. ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న విషయం తెలిసిందే. కుర్మిద్ద గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం 144 ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. ఓవైపు ఆ గ్రామ రైతులు ఉద్యమిస్తుండగా.. మరోవైపు మొండిగౌరెల్లిలో భూములను లాక్కోవాలని చూస్తుండటంతో రైతన్నలు రేవంత్ సర్కారుపై కన్నెర్రజేస్తున్నారు.
821.11 ఎకరాల సేకరణ..
మొండిగౌరెల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం 19, 68, 127 సర్వే నంబర్లలో 638 మంది రైతులకు చెందిన 821.11 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. సర్వేనంబర్ 19లో 375.27 ఎకరాలు, సర్వేనంబర్ 68లో 188.3 ఎకరాలు, సర్వే నంబర్ 127లో 113.34 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. మొత్తం 676.91 ఎకరాల అసైన్డ్ భూములతో పాటు చుట్టుపక్కల ఉన్న సుమారు మరో 140 ఎకరాల పట్టా భూములను సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. తమ భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తున్నదని తెలియడంతో స్థానిక కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
ఫ్యూచర్‌సిటీతో రియల్ వ్యాపారం
ఫ్యూచర్‌సిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పంటలు పండే భూములను తీసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. రైతుల భూములను కోట్లకు అమ్ముకొని ఖజానా నింపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పరితపిస్తున్నది. రైతుల ప్రభుత్వం అంటూ భూములను బలవంతంగా సేకరించాలనుకోవడం ఎంత వరకు సమంజసం? ఇదేనా ప్రజాపాలన?
– మర్పల్లి బాలరాజు, మొండిగౌరెల్లి
భూమిపై ఆధారపడి బతుకుతున్నాం..
తరతరాలుగా ఆ భూములను సాగుచేసుకొని బతుకుతున్నాం. ఉన్న భూమి ప్రభుత్వం తీసుకుంటే ఎలా బతకాలి. భూమిని ప్రభుత్వం తీసుకుంటే మాకు జీవనోపాధి కరువవుతుంది. బతుకు భారంగా మారుతుంది. మార్పు కావాలని నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతున్నది.
– స్వామి, రైతు, మొండిగౌరెల్లి
భూములిచ్చేది లేదు..
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడకు భూములిచ్చేదిలేదు. భూములను సాగు చేసుకొని బతుకీడుస్తున్నాం. బలవంతంగా భూసేకరణ చేపడితే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి. లేదంటే ఆందోళనలు ఉధృతంగా చేస్తాం.
– నక్క శ్రీనివాస్, మొండిగౌరెల్లి
భూముల జోలికొస్తే తరిమికొడతాం
భూముల జోలికొస్తే ఎంతటి వారినైనా తరిమి కొడతాం. గ్రామానికి రాకుండా కందకాలు తీసి అడ్డుకుంటాం. లాఠీ దెబ్బలు, పోలీసు కేసులకు భయపడేదిలేదు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం. భూసేకరణను ఆపాలి. లేదంటే లగచర్ల మాదిరిగా ఉద్యమిస్తాం.
– పాండు, మొండిగౌరెల్లి