సిరికొండ,ఏప్రిల్05 : ఆరుగారం కష్టపడి పండించిన పంట కళ్లముందే ప్రకృతి ప్రళయానికి నాశనం కావడంతో రైతులు కన్నీట పర్వతమైతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాటిపల్లి , చిమన్ పల్లి గ్రామంలోని జినిగ్యల లో వడగండ్ల వాన పడి రైతన్నను కోలుకోని దెబ్బ తీసింది. చేతికి వచ్చిన పంట కళ్లముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. యాసంగి సీజన్లో వేలాది ఎకరాలు వరి సాగు చేసి కోతలు ప్రారంభం కాగా ధాన్యం ఆరపెడుతున్నారు.
కళ్లల్లో ఎండబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులతో పలుచోట్ల వరి నేలకొరిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.