తుంగతుర్తి, జనవరి 05 : భూ వివాదంపై పోలీసులు విచారణ చేస్తుండగా ఓ రైతు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రావులపల్లి గ్రామానికి చెందిన జోగునూరి లాజరస్ కొనుగోలు చేశాడు. నాటి నుండి నేటి వరకు కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో అతడికి తెలియకుండా విజయసేనారెడ్డి భార్య సౌజన్య రెడ్డి, ఆమె కూతుర్లు తుంగతుర్తి తాసీల్దార్ను సంప్రదించి రైతుకు తెలియకుండానే 2 ఎకరాల 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నట్లు సమాచారం.
భూమి వివాదం కొనసాగుతుండగా ఈ నెల 2వ తేదీన బాధిత రైతు న్యాయం చేయాలని కోరుతూ తుంగతుర్తి తాసీల్దార్ కార్యాలయం వద్ద మరికొంతమంది రైతులతో కలిసి ధర్నా నిర్వహించాడు. ఈ విషయంపై సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బాధిత రైతులతో తుంగతుర్తి సిఐ నరసింహారావు విచారణ జరుపుతుండగా రైతు లాజరస్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుప్పకూలిన అతడిని చికిత్స కోసం తీసుకెళ్తుండగా మృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సౌజన్య రెడ్డి ఇంటి ఎదుట ఉంచి ధర్నాకు దిగారు. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తాసీల్దార్, ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Thungathurthy : భూ వివాదంపై పోలీసుల విచారణ.. గుండెపోటుతో రైతు మృతి