అనంతగిరి, జనవరి 05 : స్థానిక సంస్థల ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ప్రచారం నిర్వహించిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అందరికీ న్యాయం జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ మద్దతుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి సోమవారం అనంతగిరి మండలం గొండ్రియల గ్రామంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వారికి గట్టి బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షగా ప్రజలు భావిస్తున్నారని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు సాధించడం ద్వారా ఇది స్పష్టంగా నిరూపితమైందన్నారు.
సర్పంచ్ పదవి గ్రామ స్థాయిలో అత్యంత గొప్పదైన, బాధ్యతాయుతమైన పదవన్నారు. అవకాశాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ, ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజాక్షేత్రంలో గెలుపొందలేని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన సర్పంచులను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుందని, అలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు వచ్చేలా నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస నాయక్, మాజీ సొసైటీ చైర్మన్ నేలకుర్తి ఉషారాణి హనుమంతరావు, నాయకులు పాల్గొన్నారు.

Ananthagiri : రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం చేస్తాం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్