నీలగిరి, జనవరి 05 : నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని సోమవారం తెల్లవారుజామున యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. నురగలుగా వాంతులు చేసుకుంటుండడంతో గమనించిన తోటి విద్యార్థినులు ప్రశ్నించగా వాష్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్ తాగినట్లుగా తెలిపింది. దీంతో వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి మెరుగైన చికత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనుముల మండలం హాజారిగూడెంకు చెందిన హేమ నల్లగొండ పట్టణలోని శ్రీనగర్ కాలనీలో గల బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్ సెకండియర్ చదువుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో విద్యార్థిని యాసిడ్ తాగినట్లు సమాచారం. హాస్టల్ వార్డెన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవయ్య ఆస్పత్రికి చేరుకుని యువతి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.