Vinod Kumar | హైదరాబాద్ : కాళేశ్వరంలో భాగమైన తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోతల జరగాల్సిందే.. గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె .వాసుదేవ రెడ్డి, సతీష్ రెడ్డితో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జల సౌధలో జరిగిన సమీక్షలో ఓ మంచి మాట చెప్పారు. వానా కాలం ముగియగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు మరమ్మత్తులు చేయిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. మేము మొదట్నుంచి మరమ్మత్తుల్లో ఆలస్యం ఎంత మాత్రం వద్దని చెబుతూనే ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్‌కే మరమ్మత్తులు అవసరముంటాయి. అన్నారం, సుందిళ్లకు అవసరం ఉండకపోవచ్చు. ఒక వేళ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటే రెండు చోట్ల లిఫ్ట్‌లు అవసరం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
152 మీటర్ల ఎత్తున గోదావరి జలాల తరలింపునకు మహారాష్ట్ర అంగీకరించే ప్రసక్తే లేదు. ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా 152 మీటర్ల ఒప్పందాన్ని సాధించలేక పోయారు. ఇప్పుడు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. ముంపు ఎక్కువుంటుందని ఆయన 152 మీటర్లకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ప్రాజెక్టులకు ఏం జరిగినా భాద్యత ఓనర్‌దే అని ఎన్డీఎస్ఏ చట్టంలోనే ఉంది అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ చేశారు. మేడిగడ్డ మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయి.. అన్నారం, సుందిళ్ళకు ఏం కాలేదు.
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకువస్తే చాలా మంచిది. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవాలన్నా లిఫ్ట్ చేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి దగ్గర
ప్రాజెక్టు అసాధ్యం. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సాధ్యం కాలేదు. ఇప్పటికైనా మూడు బ్యారేజీలు రిపేర్ చేపించండి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వండి. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు ఇబ్బందులు పడకుండా చూడండి అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ విలువ రూ. 3,500 కోట్లు. అందులో మూడు పిల్లర్ల విలువ కేవలం రూ. 300 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో మూడు బారేజ్ల విలువ 6 శాతం మాత్రమే. యాసంగిలో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయక పోవడం వల్ల రైతులు నష్టపోయారు. ఆ పరిస్థితి పునరావృతం కానీయొద్దు. వీలయినంత త్వరగా మేడిగడ్డకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలి అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయని ప్రచారం
జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారా లేదా క్రాస్ చేయించారో తెలియదు. ఇంతకుముందు బిఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనలేదు. సందర్భాన్ని బట్టి బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ కోసం మేము పదవులు వదులుకున్న చరిత్ర. తెలంగాణ మీద ఈగ వాలినా బీఆర్ఎస్ సహించదు. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండాలని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో ఉన్నాము కాబట్టి మేము రెండు పార్టీలకు సమాన దూరంలో ఉన్నామని వినోద్ కుమార్ తెలిపారు.