Umar Khalid : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ (Umar Khalid) సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తనకు బెయిల్ నిరాకరించడాన్ని అతను సుప్రీంకోర్టు (Supreme Court) లో ఛాలెంజ్ చేశాడు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 2న ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam) సహా 9 మంది బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.
బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైన వారిలో ఖలీద్, షర్జీల్తోపాటు మహ్మద్ సలీమ్ ఖాన్, షిఫా ఉర్ రెహ్మాన్, అథర్ ఖాన్, మీరన్ హైదర్, అబ్దుల్ ఖాలిద్ సైఫీ, గుల్ఫిషా ఫాతిమా, షాదాబ్ అహ్మద్ ఉన్నారు. వారిలో షర్జీల్ ఇమామ్, ఫాతిమా గత వారమే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు ఉమర్ ఖలీద్ సుప్రీంకు వెళ్లాడు. ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చడాన్ని సవాల్ చేశాడు.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం పాలయ్యారు. మొత్తం 700 మందికిపైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 15 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ UAPA కింద చార్జిషీట్ నమోదు చేశారు.