Helpline | నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటైంది. నేపాల్‌లో తెలంగాణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం పేర్కొంది. విదేశాంగశాఖ, భారత రాయబార కార్యాలయంలో ప్రభుత్వం సమన్వయం చేస్తున్నది. అత్యవసరమైతే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అధికారులను సంప్రదించాలని సూచించింది. 97819 99044, 96437 23157, 99493 51270 నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని పేర్కొంది.
నేపాల్‌లో జెన్ జెడ్ నిరసనలతో అట్టుడుకుతున్నది. ప్రభుత్వంలో అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. గత రెండుమూడు రోజుల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, మంత్రులు సైతం పదవుల నుంచి తప్పుకున్నారు. సైన్యం రంగంలోకి దిగినా.. నిరసనలు తగ్గలేదు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది సైన్యం.
ఇప్పటికే పార్లమెంట్, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పుపెట్టారు. పలువురు మాజీ నాయకులను నిరసనకారులు చితకబాదారు. దాడుల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ ఆందోళనలతో భారత్ అప్రమత్తమైంది. భారత భూభాగంలోకి ప్రవేశించి, సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉండడంతో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలను అప్రమత్తం చేశారు.