Mutton Shortage : పెళ్లిళ్లు (Marriages) స్వర్గంలో నిశ్చయం అవుతాయని అంటుంటారు. కానీ ఇప్పుడు జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో మాత్రం పెళ్లిళ్లకు ముహూర్తాలను మూతపడ్డ రోడ్డు నిశ్చయిస్తున్నది. అదెలా అనుకుంటున్నారా..? భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో శ్రీనగర్-జమ్ము (Srinagar-Jammu) నగరాలను కలిపే జాతీయ రహదారి 44ను మూసేశారు. గత 15 రోజులుగా ఆ రోడ్డు మూతపడి ఉంది.
దాంతో కశ్మీర్‌కు గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా మాంసానికి తీవ్ర కొరత ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌లో ఇది పెళ్లిళ్ల సీజన్ కావడం, సరిగ్గా ఇప్పుడే రోడ్డు మూతపడి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోవడం సమస్యగా మారింది. పెళ్లిళ్లకు ఇది తీవ్ర అడ్డంకి అయ్యింది. ఎందుకంటే దాదాపు 20 నుంచి 30 రకాల భక్ష్యాలతో వడ్డించే మాంసాహార వంటకం ‘వాజవాన్’ లేకుండా అక్కడ పెళ్లిళ్లు జరగవు. ఈ ప్రత్యేక వంటకం లేకపోతే పెళ్లివిందు పరిపూర్ణం కానట్టే లెక్క.
అందుకే మాంసం కొరత కారణంగా ఏకంగా పెళ్లిళ్లనే వాయిదా వేసుకుంటున్నారు. హైవే రోడ్డు పునఃప్రారంభమై గొర్రెల, మేకల సరఫరా జరిగినప్పుడే ‘వాజవాన్’ రుచులతో పెళ్లిళ్లు జరిపించాలని వారు భావిస్తున్నారు. కాగా పర్వతాలు, లోయలు, సొరంగాలతో కూడిన 250 కిలోమీటర్ల శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి గుండా నిత్య ఢిల్లీ, పంజాబ్, హర్యానాల నుంచి 50 ట్రక్కుల గొర్రెలు కశ్మీర్‌కు సరఫరా అవుతాయి. గత 15 రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో మాంసానికి తీవ్ర కొరత ఏర్పడింది.
రోడ్డు మూతపడటంతో గొర్రెల, మేకల సరఫరా నిలిచిపోయిందని, దాంతో తమకు ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన వాళ్లకు మాంసం అందించలేకపోతున్నామని జమ్మూకశ్మీర్ మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మొహమ్మద్ చెప్పారు. మరో వారం రోజులపాటు కూడా రోడ్డు పునఃప్రారంభమయ్యే అవకాశం లేకపోవడంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. తమ అభ్యర్థనను అంగీకరించి సుమారు 210 కుటుంబాలు పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నాయని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో ప్రతి ఏడాది రూ.4,000 కోట్ల మాంసం వ్యాపారం జరుగుతుందని, అందులో పెళ్లిళ్ల కోసం వినియోగించే మాంసం వాటా రూ.1,500 కోట్లదాకా ఉంటుందని ఖజీర్ మొహమ్మద్ చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో నవంబర్ నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుందని, అందుకే అక్టోబర్‌లోనే వివాహాల సీజన్ ముగుస్తుందని చెప్పారు.