మాస్కో : తమ వైమానిక క్షేత్రంలోకి ఎంటర్ అయిన రష్యా డ్రోన్ల(Russian Drones)ను కూల్చివేసినట్లు పోలాండ్ ప్రకటించింది. మంగళవారం రాత్రి సుమారు 19 రష్యా డ్రోన్లు పోలాండ్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించాయి. అయితే దాంట్లో నాలుగు డ్రోన్లను పోలాండ్ కూల్చినట్లు స్పష్టం అవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ యుద్ధం చేసేందుకు పోలాండ్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆ దేశ ప్రధాని డోనాల్డ్ టస్క్ తెలిపారు. పోలాండ్, నాటోకు చెందిన విమానం ద్వారా ఆ డ్రోన్లను కూల్చివేశారు. ఓ నాటో దేశం వైమానిక క్షేత్రంలో రష్యా డ్రోన్లను కూల్చడం ఇదే తొలిసారి. ఏడు డ్రోన్ల శకలాలు, గుర్తు తెలియని వస్తువులను పసికట్టామని పోలాండ్ హోంశాఖ మంత్రి వెల్లడించారు. అయితే నాటో దేశంలోకి కావాలనే డ్రోన్లను ఎంటర్ చేయించారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలాండ్ ఎయిర్‌స్పేస్‌లోకి డ్రోన్లు వెళ్లినట్లు వచ్చిన వార్తలను రష్యా దౌత్యవేత్త ఖండించారు.
పోలాండ్లోని వార్సాకు రావాల్సిన విమానాలను ఆలస్యం చేశారు. వివిధ దేశాల నుంచి వస్తున్న విమానాలను మరో ప్రాంతానికి డైవర్ట్ చేశారు. పోలాండ్లోని అతిపెద్ద వార్సా చోపిన్ విమానాశ్రయంలో డిలేలు కొనసాగుతున్నాయి. కొన్ని విమానాలను రద్దు చేశారు. తాజా అటాక్ గురించి క్రెమ్లిన్ కామెంట్ చేసింది. ప్రస్తుత పరిస్థితిపై తామేమీ కామెంట్ చేయలేమని రష్యా పేర్కొన్నది. జర్నలిస్టులతో క్రెమ్లిన్ ప్రతినిది దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై రక్షణ కార్యాలయం మాట్లాడుతుందన్నారు.
పోలాండ్ వైమానిక క్షేత్రంలోకి కనీసం 24 రష్యా డ్రోన్లు ఎంటర్ అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. వీటిలో కొన్ని బెలారస్ ఎయిర్‌స్పేస్ ద్వారా ఎంటర్ అయినట్లు ఆయన వెల్లడించారు.