బయ్యారం, జూలై 4 : మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో అమలు చేయాలని కోరుతూ బయ్యారం మండల కేంద్రం బస్టాండ్ సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు గంటసేపు ధర్నా నిర్వహించి తహసిల్దార్ నాగరాజు గురించి పత్రం అందించారు.
ఈ సందర్భంగా హరిప్రియ నాయక్, ఆంగోత్ బిందు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అమలు గాని హామీలతో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ నేడు అధికారంలోకి వచ్చాక ప్రజల హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రగల్బాలు పలికి గ్రామంలో ఒక్కరిద్దరికి మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని.. కొన్నిచోట్ల అర్హులైన నిరుపేదలకు కూడా ఇండ్లు అందడం లేదని అన్నారు.
మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ, పెన్షన్ల పెంపు, ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ నాయకులను వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అందరికీ రుణమాఫీ కాలేదని, రైతుబంధు పడలేదని, యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు మాత్రం అంతా బాగుందని ప్రజల సంతోషంగా ఉన్నారు చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరారు. అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.