Srinivas Goud | హైదరాబాద్ : ఓ ఐదు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికా తెలంగాణ తెచ్చుకున్నది..? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా.. 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని కాంగ్రెస్ సర్కార్‌పై శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్ మరియు మొదలగు కోర్సులలో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ కౌన్సిలర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద విద్యార్థులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ నిరసన దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. 12 లక్షల మందికి పైగా విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తక్షణమే ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకున్నది ఓ ఐదు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కాదు. నాడు వందల మంది విద్యార్థులు ప్రాణాలకు తెగించి కొట్లాడింది.. విద్యార్థుల భవిష్యత్ కోసం. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1200 కోట్లు విడుదల చేయాలి. ఇందులో కేవలం రూ. 300 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఇలా అయితే ప్రయివేటు కాలేజీలు ఎలా నడుస్తాయి..? ఉద్యోగులకు జీతాలు ఎట్లా చెల్లించాలి..? బకాయిలు చెల్లించడం లేదని విద్యార్థులకు ఆయా కాలేజీలు సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. మరి విద్యార్థులు ఉన్నత చదువులు ఎలా చదవాలి..? ఉద్యోగాలు పొందేది ఎలా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
దశల వారీగా బకాయిలను విడుదల చేయాలి. లేని పక్షంలో శ్రీలంక, నేపాల్‌లో జరిగిన ఘటనలు తెలంగాణలో చోటు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు. మీ గురించేనా తెలంగాణ తెచ్చుకున్నది… మీరు కోట్లు సంపాదించుకునేందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. బకాయిలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అటు రైతులు, ఆటో డ్రైవర్లు నాశనమైపోయారు. ఏ వ్యవస్థ కూడా సరిగా లేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. తెలంగాణ ఉద్యమకారులను అందర్నీ ఏకం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించకపోతే 2800 కాలేజీలు మూతపడే అవకాశం ఉంది. 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయాలను విడుదల చేయాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణా రెడ్డిని కలిసి కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, సురేష్, తదితరులు ఉన్నారు.