కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 4 : మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణను(Ceasefire) మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నట్లుగా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదలైంది. గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది.
ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించాము. ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్దతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించాము. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. కావున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాము. గతంలో కొనసాగిన విధంగానే మా వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషిచేస్తాము.
ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నాము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగంపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నాము అంటూ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
