అగ్ర కథానాయకుడు ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ది రాజా సాబ్. టాలీవుడ్ దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రం జనవరి 09 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ స్పందించింది. రాజాసాబ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలు అబద్దమని.. అనుకున్న తేదీకే రాజాసాబ్ రాబోతుందని తెలిపింది.
‘రాజా సాబ్’ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. జనవరి 9న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి గ్రాండ్గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్లో అమెరికాలో భారీస్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ప్లాన్ ఉంది. డిసెంబర్ 25 లోపు అన్ని పనులు పూర్తి చేసి ఫైనల్ కాపీని రెడీ చేస్తాం. ఈ సంక్రాంతి సీజన్లో థియేటర్లను హోరెత్తించేందుకు ప్రభాస్ ‘రాజా సాబ్’గా సిద్ధంగా ఉన్నాడు. నిర్మాత విశ్వప్రసాద్ ఎలాంటి రాజీ లేకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడు మారుతి ప్రతి డీటెయిల్పై రెట్టింపు శ్రద్ధ పెడుతూ సినిమాను పర్ఫెక్ట్గా సిద్ధం చేస్తున్నారు అని నిర్మాణ సంస్థ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.