Collector Pamela Satpathi | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుండి 28 వరకు నిర్వహించనున్నారు. విద్యానగర్లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భాషలు లేని కాలంలో సైగల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేదని తెలిపారు.
అందువల్ల సైన్ లాంగ్వేజిని చిన్నచూపు చూడొద్దని అన్నారు. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. దివ్యాంగుల భావాలను అర్థం చేసుకొని వారితో మెరుగైన కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ద్వారా అధికారులకు, ఉత్సాహం ఉన్నవారికి సైన్ లాంగ్వేజీ నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఈ భాష నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఒకసారైనా అంధుల, బధిరుల పాఠశాలల్లో విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ బధిరుల పాఠశాలలో విద్యార్థులకు ఇదివరకే టైలరింగ్, రైటింగ్ వంటి స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్, మొబైల్ రిపేరింగ్ వంటి రంగాల్లో కూడా వీరికి శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వెంకటేష్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. చట్టం ప్రకారం దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటివి అందజేయాలని తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కచ్చితంగా అమలుపరచాలని అన్నారు.
దివ్యాంగుల చట్టాలను వారికి వివరించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు ఈ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కరీంనగర్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంతోపాటు అధికారులకు నేర్పించడం మంచి విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఈ.పి.ఐ.డి బాధ్యులు డాక్టర్ హిమాన్షు, ప్రియాంక, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జి సి డి ఓ కృపారాణి, తహసిల్దార్ నరేందర్, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు.