కౌకుంట్ల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) సూచించారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం రాజోలి, పుట్టపల్లి, ఇస్రంపల్లి, కౌకుంట్ల గ్రామాల బూత్ల వారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జ్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును మరింత విస్తృతంగా చేపట్టాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్లో అర్హులైన ఓటరు పేరును తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.