Pregnancy | గర్భధారణ మహిళ జీవితంలో శారీరక, మానసిక, జీవక్రియల పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకునే ప్రత్యేక దశ. ఈ సమయంలో సాధారణంగా పోషకాహారంపైనే ఎక్కువ దృష్టి పెట్టినా, పేగుల ఆరోగ్యం (గట్ హెల్త్) కూడా తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవసరమైన పోషకాలు శరీరానికి సులభంగా అందడమే కాకుండా గర్భధారణ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలను కూడా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ప్రొజెస్టెరోన్ హార్మోన్ స్థాయిలు పెరగడంతో ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల కడుపు నిండిన భావన, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే పేగుల ఆరోగ్యం బాగుంటే ఈ సమస్యల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన పేగులు శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలను సమర్థంగా శోషించడంలో సహాయపడతాయి. ఇవి గర్భిణి ఆరోగ్యంతోపాటు గర్భంలోని శిశువు ఎదుగుదలకు కూడా ఎంతో అవసరం. పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటే పోషకాల శోషణ తగ్గి, అవసరమైన పోషకాల లోపం, అధిక బరువు పెరగడం, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇవి శిశువు అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పేగుల ఆరోగ్యం కేవలం జీర్ణక్రియకే పరిమితం కాదు. మన భావోద్వేగాలను నియంత్రించే సెరోటోనిన్ అనే హార్మోన్లో పెద్ద భాగం జీర్ణవ్యవస్థలోనే ఉత్పత్తి అవుతుంది. అందువల్ల పేగుల ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. గర్భధారణ సమయంలో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ భావోద్వేగ సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది.
పేగుల్లో మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడటంలో ప్రోబయోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు పేగుల పనితీరును సమతుల్యంలో ఉంచేందుకు సహాయపడతాయి. మజ్జిగ, పెరుగు, పులియబెట్టిన ఆహారాలు వంటి సహజ ఆహారాల్లో ప్రోబయోటిక్స్ లభిస్తాయి. అవసరమైతే వైద్యుల సలహాతో ప్రోబయోటిక్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్ వల్ల పోషకాల శోషణ మెరుగై రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు గర్భధారణకు సంబంధించిన కొన్ని సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గర్భంలోని శిశువు ఎదుగుదలకూ ఇవి తోడ్పడతాయి. అయితే అన్ని రకాల ప్రోబయోటిక్స్ ఒకే విధమైన ప్రయోజనాలు ఇవ్వవని, అందువల్ల గర్భిణులు స్వయంగా సప్లిమెంట్లు ప్రారంభించకుండా తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రోబయోటిక్స్‌ను ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయంగా భావించకూడదు. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, తేలికపాటి శారీరక వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం వంటి అలవాట్లు కూడా తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి సమానంగా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.