Team India : ఒకటికాదు.. రెండుకాదు మూడుసార్లు టీ20 ఛాంపియన్.. జట్టు నిండా రికార్డుల మోత మోగించిన ఘనులే.. గత రెండేళ్లలో పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి సిరీస్‌లోనూ విజయమే. పెద్ద జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా ఇటీవల అనూహ్యంగా తడబడుతోంది. అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో పసికూన ఐర్లాండ్ (Ireland) చేతిలో 2-0తో సిరీస్ ఓటమి క్రికెట్ పండితులనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లండ్ పర్యటనలోనూ పరాజయమే పలకరించగా.. అసలు భారత జట్టుకు ఏమైంది? అనే సందేహాలకు తావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథ్యంలో తిరుగులేని శక్తిగా ఉన్న టీమిండియా.. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో చతికిలపడడం అభిమానుల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.
పొట్టి ఫార్మాట్లో చితక్కొట్టే ఆటగాళ్లు.. వికెట్ల వేటతో భయపెట్టే బౌలర్లు.. మొన్నటిదాకా టీమిండియా సిరీస్ అంటేనే ఉలిక్కిపడేవి అన్ని జట్లు. టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన టీమిండియా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరసగా 8 ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్ కూడా కొల్లగొట్టి ప్రత్యర్థులను హడలెత్తించింది. ఆ దెబ్బతో అమ్మో.. భారత్‌తో పొట్టి సిరీస్ అంటేనే భయపడే పరిస్థితి. కానీ, ఐర్లాండ్ సిరీస్ ఓటమి అన్నింటినీ తలకిందులు చేసింది. పసికూన చేతిలో వైట్‌వాష్ ఫలితంగా భారత్‌ను మేమూ ఓడించగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతోంది మిగతా టీమ్‌లకు.
India has gone winless in 4 consecutive T20is for the first time in nearly 5 years. pic.twitter.com/9ew4h6QiDM
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2026
సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. తొలి విదేశీ పర్యటనలోనే కంగుతినడం చూసి షాకవుతున్నారంతా. ‘అరే.. ఇంతలోనే ఏమైంది?’ రికార్డు విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టిన జట్టు ఇప్పుడు హ్యాట్రిక్ ఓటములు చవిచూడడం ఏంటీ?’ అనేది అంతుచిక్కడం లేదు. దీనికంతటికీ కెప్టెన్సీ మార్పే కారణమా? అనే చర్చ జోరందుకుంది. కానీ, ఐపీఎల్లో విజయవంతమైన శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయంగా విఫలమవ్వడం, జట్టు కూర్పులో లోపం, బౌలింగ్ యూనిట్ వైఫల్యం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారత టీ20 జట్టులోని కుర్రాళ్లంతా ఐపీఎల్లో పోటుగాళ్లే. వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan), అభిషేక్ శర్మ (Abhishek Sharma).. ఐపీఎల్లో రికార్డు శతకంతో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజూ శాంసన్, ఆసియా కప్ హీరో తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. ఇలా.. అందరూ ఎవరికి వారే సాటి. వీరంతా టీ20ల్లో సెంచరీలతో అలరించినవాళ్లే. కానీ, విదేశీ గడ్డపై పరిస్థితులను అర్ధం చేసుకోకుండా హిట్టింగ్ ఆడాలనుకోవడం టీమిండియా ఆటగాళ్ల బలహీనతగా మారింది.
🚨 WORLD CHAMPIONS INDIA’S POOR RUN IN T20Is. 📉
Lost 3 of their last 4 T20Is, with one no result. pic.twitter.com/uJx4UFT1cs
— Clutch Sports (@Clutchsportsz) July 4, 2026
పైగా.. తుది జట్టులో స్థానం కోసం పోటీ నెలకొనడంతో.. తొలి బంతి నుంచే ఉతికేస్తేనే మరో మ్యాచ్‌కు అవకాశముంటుందనే భావన కూడా వైఫల్యానికి ఓ కారణం. ఐపీఎల్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రభావం కావచ్చు.. మన ఆల్‌రౌండర్లు అంతర్జాతీయంగా తేలిపోతున్నారు. బౌలింగ్ యూనిట్లో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపై ఎక్కువగా ఆధారపడడం, నిలకడలేమి వంటివి విజయావకాశాల్ని దెబ్బతీస్తున్నాయి.
ప్రతి సిరీస్‌కు స్క్వాడ్ ఎంపికలో కొందరికీ అన్యాయం జరుగుతోంది. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ స్థిరపడగా.. సంజూ శాంసన్ మాత్రం మళ్లీ లయ తప్పాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దూసుకురావడంతో ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మూడో స్థానంలో ఇషాన్ కిషన్ ఎంపిక సరైందే అనిపిస్తున్నా.. తిలక్ వర్మ విఫలమవుతున్నాడు. అంతేకాదు టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉండడం ప్రత్యర్థి బౌలర్ల పనిని తేలిక చేస్తోంది. దాంతో, ఒక కుడిచేతివాటం ప్లేయర్ ఉండాల్సింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
🚨 There is a massive difference between a batsman who looks aesthetic in PR and a player who actually delivers when the trophy is on the line.
Real longevity is built on runs, bring Rajat Patidar, we don’t need Tilak Varma’s 15 ball 12 in T20I.🤷♂️
pic.twitter.com/KT8UbUJlXr— A N U J (@Hello_anuj) July 6, 2026
ఐపీఎల్లో ఆర్సీబీ నిరీక్షణకు తెరదించుతూ రెండుసార్లు విజేతగా నిలిపిన రజత్ పాటిదార్(Rajat Patidar) టీ20లకు తగ్గట్టుగా సరిపోతాడు. కానీ, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో అతడికి చోటే దక్కలేదు. రాజస్థాన్ రాయల్స్ తరఫున చితక్కొట్టే యశస్వీ జైస్వాల్ ఉండనే ఉన్నాడు. బౌలింగ్ దళంలో చోటు కోసం ఎదురుచూస్తున్న ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ఓటముల నుంచి పాఠాలు నేర్వకుంటే, జట్టు కూర్పులో లోపాలను సరిదిద్దుకోకుంటే.. మరో వెస్టిండీస్‌లా టీమిండియా కూడా చేజేతులా మరిన్ని సిరీస్‌లు కోల్పోయే ప్రమాదముంది.
Ireland win the 2️⃣nd T20I by 1 run and clinch the series.
Up next for #TeamIndia is the T20I series against England.
Scorecard ▶️ https://t.co/L8GAMNqUC4#IREvIND pic.twitter.com/lvGbGWPcVv
— BCCI (@BCCI) June 28, 2026