జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన పత్రాలను వడ్డెర సంఘాల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వడ్డెర సంఘాలకు వేర్వేరుగా భవనాలను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి చెక్కులు అందేలా చూస్తామని, ఇందుకు పైరవీలు చేయాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నాయకులవి మాటలు తప్ప చేతల్లో ఏమీలేదని ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక గల్లీని కూడా సందర్శించకపోగా పది పైసల పనిని కూడా చేపట్టలేదని ఆరోపించారు. కల్లాలు ఎత్తేస్తామని చెబుతున్న బీజేపీ నాయకులకు ఓటు వేయొద్దన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన నిలబెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.