ఓవల్: ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. తొలి రెండ్రోజులు బౌలర్లకు అనుకూలించిన ఓవల్ పిచ్.. మూడోరోజు అందుకు భిన్నంగా స్పందిస్తూ బ్యాటింగ్‌కు సహకరించడంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 396 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (164 బంతుల్లో 118, 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో మెరవగా ఆకాశ్ దీప్ (94 బంతుల్లో 66, 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ (5/125) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా అట్కిన్సన్ (3/127)కు మూడు వికెట్లు దక్కాయి. భారత్ నిర్దేశించిన 374 పరుగుల ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్.. 13.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. బెన్ డకెట్ (34 నాటౌట్) క్రీజులో ఉండగా ఆట ముగుస్తుందనగా సిరాజ్.. క్రాలీ (14)ని ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ విజయానికి 324 పరుగులు అవసరం కాగా భారత్‌కు 9 వికెట్లు కావాలి. రెండు రోజుల ఆట మిగిలున్న ఓవల్‌లో భారత పేసర్లు.. ఆతిథ్య జట్టు బజ్‌బాల్ దూకుడును ఏ మేరకు అడ్డుకుంటారనేది ఆసక్తికరం!
ఆకాశ్ అదుర్స్
మూడో రోజు తొలి సెషన్లో కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాలన్న ఇంగ్లండ్ పప్పులేమీ ఉడకలేదు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్.. తన కెరీర్లోనే అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లుచల్లాడు. ఓవర్ నైట్ స్కోరు 75/2 వద్ద మూడోరోజు ఆటను ఆరంభించిన భారత్.. ఆకాశ్ జోరు, జైస్వాల్ నిలకడతో పటిష్ట స్థితిలో నిలిచింది. జైస్వాల్ నెమ్మదిగా ఆడినా ఆకాశ్ మాత్రం బౌండరీలతో చెలరేగాడు. అట్కిన్సన్, టంగ్, ఓవర్టన్, బెతెల్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కున్న అతడు.. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. మూడో వికెట్‌కు జైస్వాల్‌తో కలిసి 107 పరుగులు జోడిస్తే అందులో ఆకాశ్వే 66 రన్స్ కావడం విశేషం. అట్కిన్సన్ ఓవర్లో రెండు బౌండరీలతో 40లలోకి వచ్చిన ఆకాశ్.. అతడే వేసిన 38వ ఓవర్లో బౌండరీతో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. లంచ్‌కు ఒక్క ఓవర్ ముందు ఆకాశ్.. ఓవర్టన్ బౌలింగ్‌లో అట్కిన్సన్కు క్యాచ్ ఇచ్చాడు.
జైస్వాల్ శతక జోరు
ఐదో స్థానంలో వచ్చిన కెప్టెన్ గిల్.. లంచ్ తర్వాత అట్కిన్సన్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్ నిష్క్రమించినా కరుణ్ (17)తో కలిసిన జైస్వాల్ శతకం దిశగా సాగాడు. అట్కిన్సన్ ఓవర్లో సింగిల్ తీసి తన కెరీర్లో ఆరో, ఇంగ్లండ్‌పై నాలుగో శతకాన్ని నమోదుచేశాడు. మొదటి టెస్టులో సెంచరీతో ఈ సిరీస్‌ను మొదలెట్టిన జైస్వాల్.. అదే శతకంతో సిరీస్‌ను ముగించడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న కరుణ్.. అట్కిన్సన్ ఓవర్లో కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో టీమ్ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. శతకం తర్వాత జైస్వాల్.. టంగ్ వేసిన షార్ట్ డెలివరీని ఆడబోయి డీప్ పాయింట్ వద్ద ఓవర్టన్ చేతికి చిక్కాడు.
జడ్డూ, సుందర్ మరో కీలక ఇన్నింగ్స్
జైస్వాల్ ఔట్ అయ్యేటప్పటికీ భారత ఆధిక్యం 255 పరుగులుగానే ఉంది. ఈ క్రమంలో జురెల్ (34)తో జతకలిసిన జడేజా మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జురెల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ ఏడో వికెట్‌కు 72 బంతుల్లో 50 రన్స్ జోడించి భారత ఆధిక్యాన్ని 300 దాటించారు. టీ విరామం తర్వాత ఓవర్టన్.. జురెల్‌ను వికెట్ల ముందు బలిగొన్నాడు. టంగ్ ఓవర్లో బౌండరీతో జడేజా ఈ సిరీస్‌లో ఆరో ఫిఫ్టీని పూర్తిచేశాడు. అయితే కొత్త బంతి తీసుకున్న తర్వాత అతడు.. టంగ్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో సిరాజ్ కూడా నిష్క్రమించాడు. సిరాజ్ ఔట్ అయ్యేటప్పటికీ వాషింగ్టన్ 17 రన్స్ వద్ద ఉన్నాడు. కానీ ప్రసిద్ధ్‌ను అవతలి ఎండ్‌లో ఉంచి అతడు బజ్‌బాల్ ఆటతో ఇంగ్లిష్ పేసర్లను చితకబాదాడు. 6, 6, 6, 2, 4, 4, 6తో 39 బంతుల్లోనే అర్ధశతకం సాధించి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దూకుడుగా ఆడే క్రమంలో అతడు టంగ్ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్ ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 224 ఆలౌట్ ; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247 ఆలౌట్ ; భారత్ రెండో ఇన్నింగ్స్: 88 ఓవర్లలో 396 ఆలౌట్ (జైస్వాల్ 118, ఆకాశ్ 66, టంగ్ 5/125, అట్కిన్సన్ 3/127) ; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 13.5 ఓవర్లలో 50/1 (డకెట్ 34*, క్రాలీ 14, సిరాజ్ 1/11)