బెంగళూరు, అక్టోబర్ 17: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో దారుణం జరిగింది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ వాష్‌రూమ్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై (Engineering Student) సహచర విద్యార్థి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆరవ సెమిస్టర్ చదువుతున్న నిందితుడు జీవన్ గౌడ (21)ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. అక్టోబర్ 10న ఈ ఘటన జరగగా ఐదు రోజుల తర్వాత 15వ తేదీన ఏడవ సెమిస్టర్ చదువుతున్న బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడు ఒకే కళాశాలలో ఒకే తరగతిలో చదివేవారు.
వారిద్దరూ పరిచయస్తులే. అయితే బ్యాక్లాగ్ కారణంగా జీవన్ గౌడ చదువులో ఒక సంవత్సరం వెనుకబడ్డాడు. ఘటన జరిగిన రోజు గౌడ పిలవడంతో ఆర్కిటెక్చర్ బ్లాక్ సమీపంలోకి వెళ్లిన ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత ఆమెను పురుషుల వాష్‌రూమ్‌లోకి లాక్కుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇద్దరు స్నేహితులకు తెలియచేసింది. ఆ తర్వాత గౌడ ఆమెకు ఫోన్ చేసి పిల్(గర్భ నిరోధక మాత్ర) ఏమైనా కావాలా? అని అడిగినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. భయంతో ఈ ఘటన గురించి యువతి తన తల్లిదండ్రులకు ఆలస్యంగా చెప్పగా వెంటనే వారు హనుమంతనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచార ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. గడచిన నాలుగు మాసాలలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పకూలిపోయిందని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నేత ఆర్ అశోక ఆరోపించారు. బాలికలపై 979 లైంగిక దాడులు జరిగాయని చెప్పారు.