కారేపల్లి,అక్టోబర్3 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటుకారేపల్లి గ్రామ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లే దారికి గేటు కారేపల్లి గ్రామ వాస్తవ్యులు మంద అప్పారావు దంపతులు విద్యుత్ స్తంభాలను వితరణగా ఇచ్చారు. బుగ్గవాగు ఒడ్డున రామలింగేశ్వర స్వామివారి దేవాలయం గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్నది. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, శివపార్వతుల కళ్యాణం నాడు గుడికి వెళ్లాలంటే భక్తులు చీకటిలో ఇబ్బందులు పడుతుండేవారు.
దాంతో మంద అప్పారావు సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో 18 కరెంటు స్తంభాలు, ఎల్ఈడి లైట్స్ ఏర్పాటుకు చేయూతనిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం గ్రామస్తుల ఆధ్వర్యంలో విద్యుత్తు సరఫరా కల్పించి స్విచ్ ఆన్ చేసి లైట్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దాత మంద అప్పారావు, సాయిని తిరుపతయ్య, గుడిపూడి నరసయ్య, చెరుకూరి వెంకటేశ్వర్లు, మూడు శ్రీను, సాయిని తిరుపతిరావు, గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.