Koya Sriharsha | మంథని, ఫిబ్రవరి 10: మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 130 మంది సిబ్బందిని నియమించారు. మంథనిలో మున్సిపాలిటీలో మొత్తం 14402 మంది ఓటర్లుండగా పురుషులు-6949, స్త్రీలు-7452, ఇతరులు-1 తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎన్నికల సామాగ్రీ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం ఎన్నికల సామాగ్రీని పంపిణీ చేశారు. పోలింగ్ ఆనంతరం ఎన్నికల సామాగ్రీ, బ్యాలెట్ బాక్స్‌లను తీసుకునేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కలెక్షన్ పాయింట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్‌ను సైతం ఇక్కడే ఏర్పాటు చేశారు. మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని ఆర్డీవో కాశబోయిన సురేష్, తహసీల్దార్ ఆరీఫోద్దిన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు సూచనలు, సలహాలు అందజేశారు.
అదే విధంగా స్ట్రాంగ్ రూం, కలెక్షన్ పాయింట్, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాన్ని సైతం ఆయన పరిశీలించిన మున్సిపల్ కమీషనర్ మనోహర్‌ను వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సామాగ్రీని తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోకి సాయంత్రం వరకు తరలి వెళ్లారు. ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో పలు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో వృద్ధులను తరలించేందుకు వీలు చైర్లను అందుబాటులో ఉంచారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
26 పోలింగ్ కేంద్రాల్లో 130 మంది ఎన్నికల విధులు..
మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 130 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 26మంది పీవోలుగా, 26 మంది ఏపీవోలుగా, 78 మంది వోపీవోలుగా విధులు నిర్వహించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1పీవో, 1ఏపీవో, 3వోపీవోలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. అదే విధంగా ఎన్నికల్లో ఆర్వోలు-5, ఏఆర్వో-5, వెబ్‌కాస్టింగ్-26గా విధులు నిర్వహిస్తారు.
అత్యంత సమస్యాత్మకంగా-12,సమస్యాత్మక-10 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..
పోలింగ్ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని 13 వార్డులుండగా 26 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలను మూడు విభాగాలుగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మకంగా 2వ వార్డుల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని రెండు పోలింగ్ కేంద్రాలు, 3వ వార్డులోని జూనియర్ బాలుర జూనియర్ కళాశాలలోని రెండు, 5వ వార్డులోని గొల్లగూడెంలోని అంగన్వాడీ పాఠశాలలోని ఒకటి, కూచీరాజ్పల్లిలోని ప్రాథమిక పాఠశాలలోని ఒకటి, 6వ వార్డులోని బోయినిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రెండు, 7వ వార్డులోని వడ్లవాడలోని అంగన్వాడీ పాఠశాల రెండు, 11వ వార్డులోని మజీద్వాడలోని ప్రభుత్వ పాఠశాలలోని రెండు పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అదే విధంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 4వ వార్డులోని గంగాపురిలోని ప్రభుత్వ పాఠశాలలోని ఒకటి, మార్కెట్ కమిటీ కార్యాలయంలోని ఒకటి, 8వ వార్డులో గురుకుల బాలుర ఉన్నత పాఠశాలలో రెండు, 9వ వార్డులోని గర్ల్ ప్రైమరీ పాఠశాలలో రెండు, 12, 13వ వార్డుల్లో గర్ల్ హైస్కూల్లోని నాలుగు పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మిగిలిన పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సాధారణ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.