హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు జరుగుతున్న కీలక సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన ఏఈవోలకు ప్రభుత్వం ఎన్నికల డ్యూటీలు వేయడం సమస్యాత్మకంగా మారింది. ఏఈవోలంతా రైతు వేదికలను వదిలేసి.. ఎన్నికల డ్యూటీలో తిరుగుతున్నారు. మరోవైపు, రైతులేమో సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకవైపు ధాన్యం, పత్తి, మక్కజొన్న వంటి పంటల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తేమ, తాలు, యాప్ల పేరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, యాసంగి సీజన్ ప్రారంభమైంది. యూరియా సమస్య కూడా మొదలైంది. ఇలాంటి సమయంలో ఏఈవోలు అందుబాటులో లేకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లలో సీసీఐ పెడుతున్న కొర్రీలు అన్నీ ఇన్నీ కావు. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకుంటేనే సీసీఐ కొనుగోలు చేస్తున్నది.
ధాన్యం కొనుగోలు సమయంలో ఏఈవోలు ఉం డాలి. తేమ, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. అక్కడ ఏఈవోలు ఉంటే కోతలు, కొర్రీలు తగ్గే అవకాశం ఉం టుంది. మక్కల కొనుగోళ్లలో బయోమెట్రిక్ అమలు చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలు రైతులు మక్కలు విక్రయించాలంటే అక్కడ ఏఈవో తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో రైతులకు తోడుగా ఉండాల్సిన ఏఈవోలు ఎన్నికల విధుల్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవారు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏఈవోలను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని రైతులు కోరుతున్నారు.