గజ్వేల్, నవంబర్ 27: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం గజ్వేల్ మండలంలోని అక్కారం క్లస్టర్‌ను ఆమె సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. మొదటి విడత జీపీ ఎన్నికలకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎంపీడీవోలు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా క్లస్టర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం ప్రతిదీ క్లుప్తంగా తనిఖీ చేశాకే స్లిప్‌లను అందజేయాలని స్టేజ్-1, 2 ఆర్వోలను కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు సహాయం కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. జగదేవ్‌పూర్, గొల్లపల్లి గ్రామ పంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియను గురువారం కలెక్టర్ హైమావతి పరిశీలించారు. అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ప్రవీణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాయపోల్/దౌల్తాబాద్, నవంబర్ 27: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. రాయపోల్ మండల కేంద్రంతో పాటు అనాజీపూర్ క్లస్టర్ పరిధిలో నామినేషన్ల స్వీకరణ, వాటి ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో 7 మండలాలు, 163 గ్రామ పంచాయతీ స్థ్ధానాలతో పాటు 1432 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు పూర్తి అప్రమత్తతో క్లస్టర్ల వారీగా నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. క్లస్టర్ చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంద ని. అభ్యర్ధితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి పంపాలని, బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో జమ్లానాయక్, ఎంపీవో శ్రీనివాస్ అధికారులు ఉన్నారు.