హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను( Panchayat Elections) ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ( DGP Shivdhar Reddy
) ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మొదలుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిస్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని,ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్ 2 అడిషనల్ డీజీపీ డీఎస్ చౌహాన్, మల్టి జోన్- 1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ రమణ కుమార్, లీగల్ అడ్వయిజర్ ఇ రాములు, తదితరులు పాల్గొన్నారు.