నారాయణఖేడ్, సెప్టెంబర్ 30: కొడుకులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నర్సారెడ్డి (85), అంజమ్మ (82)లకు సిద్దారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
సిద్దారెడ్డి, సంగారెడ్డి స్థానికంగా, కిష్టారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వృద్ధ దంపతుల పేర దాదాపు 30 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నది.భూమి పంపకాల్లో తేడాలు రావడంతో తల్లిదండ్రులు, కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వృద్ధ దంపతులు ఇద్దరే గ్రామంలో విడిగా మరో ఇంట్లో ఉంటున్నారు.
బుధవారం ఉదయం వారి వ్యవసాయభూమిలోని బావిలో వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. మనుమడు మారుతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.