సోన్/ఖానాపూర్, సెప్టెంబర్ 30 : అప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా.. నిర్మల్ మండలం డ్యాంగాపూర్కు చెందిన రైతు కడతాల అంజయ్య (41) తనకున్న మూడెకరాలతోపాటు తన అన్న హనుమాండ్లుకు చెందిన మరో మూడెకరాల్లో పత్తి, పసుపు, వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెట్టుబడికి ప్రైవేట్‌గా రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు.
ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అంజయ్యకు భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.
ఖానాపూర్ మండలం మాసాపూర్ కు చెందిన రైతు వడ్లూరి చిన్నయ్య (58) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో ని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. సాగు కూడా కలిసి రాలేదు. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం తన పత్తి చేనుకు వెళ్లిన చిన్నయ్య ఇంటికి రాకపోవడంతో పెద్ద కుమారుడు వడ్లూరి శివరాజ్ పొలానికి వెళ్లాడు. అకడ తండ్రి జామ చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ కన్పించాడు. వెంటనే స్థానికుల సాయంతో కిందికి దింపగా అప్పటికే చనిపోయాడు. పోలీసులు కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.