జూలూరుపాడు, ఆగస్టు 03 : గత మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, కుటుంబ పోషణ కూడా గడవడం లేదని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు నిలిచిపోయినప్పటికీ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ సోమవారం జూలూరుపాడు ఎంపీఓ తులసీరామ్ కి ఆయన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ… ఇతర ఉపాధి హామీ సిబ్బంది చేస్తున్న ‘పెన్-డౌన్’ నిరసన కార్యక్రమానికి తాము దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనులను సజావుగా నడిపిస్తున్నామని తెలిపారు. జులై 31 వరకు క్షేత్రస్థాయిలో కూలీలతో పనులు చేయించి, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మస్టర్లను నమోదు చేసి పంపించినప్పటికీ పేమెంట్లు నిలిచిపోవడం దారుణమన్నారు.
వరుసగా మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం అత్యంత ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నామని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్లు ఎం.రమేష్, జి.హరికృష్ణ, జి.నాగేష్, బి.జగదీష్, ఎ.లక్ష్మణ్, డి.నాగేశ్వరరావు, బి.బాలు, డి.రవి, ఎస్.భద్రం, షేక్ బాజీ పాల్గొన్నారు.