
కీసర, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు కీసరగుట్టకు పెద్ద ఎత్తున విచ్చేశారు. శివనామస్మరణతో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు గర్భాలయంలో స్వామికి పంచామృతాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులు కాశీవిశ్వేశ్వరాలయం, లక్ష్మీనర్సింహస్వామి, నాగదేవతను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల కోలాహలంతో కీసరగుట్ట ఆలయం పరవశించిపోయింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్ పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలి : మంత్రి
ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకున్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం కార్తిక పౌర్ణమి కావడంతో మంత్రి కీసరగుట్టకు విచ్చేశారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి, వేదపండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. గర్భాలయంలో ఉన్న స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. గజ స్తంభం వద్ద మంత్రి కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆలయ ధర్మకర్తలు శ్రావన్‌కుమార్, సాయినాథ్‌గౌడ్, రమేశ్‌యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.