ఖైరతాబాద్, మార్చి 25 : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటాయి….తాజాగా పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరలు పెంచడంతో పేదలపై ఆర్థిక భారం పడిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌కు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 40 మంది లబ్ధిదారులకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, హైదారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్నరామ్మూర్తితో కలిసి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను తీసుకొచ్చి, పేదల ఇండ్లల్లో ఆర్థిక భారాన్ని తగ్గించారన్నారు. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, దళిత, రైతు బంధు, ఇలాంటి అనేక పథకాలతో పేదలను ఆదుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతుందన్నారు. త్వరలోనే నిమ్స్‌లో రెండు వేల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అవుతున్నదని, అత్యాధునిక సౌకర్యాలతో పేదలకు వైద్య సేవలందిస్తారన్నారు. 2014లో బీజేపీ నేతలు ఎన్నికల ముందు అన్ని ఫ్రీగా ఇస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని, ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. ధరలపై నిలదీయాలన్న ఇంగిత జ్ఞానం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కు లేదన్నారు. ధరలపై తెలంగాణ మంత్రులు నిలదీస్తే కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అవమానకరంగా మాట్లాడుతున్నారని, రాబోవు రోజుల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడులు అరుణ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు మల్కు మహేందర్ బాబు, గజ్జెల అజయ్, వైల ప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.