రాయపోల్ : చెడుపై మంచి సాధించిన విజయంలో భాగంగా నిర్వహించుకునే దసరా పండుగను (Dussehra festival ) గ్రామస్థులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. మెదక్ జిల్లా రాయపోల్(Rayapol) మండలంలో గ్రామస్థులు ఉదయం దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన వస్త్రాలు ధరించి ప్రజలందరూ ఒక చోటకు చేరుకొని అక్కడి నుంచి డప్పు వాయిద్యాలతో పాలపిట్ట కోసం, జమ్మి ఆకు కోసం చెట్టు వద్దకు వెళ్లి వేద బ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత వాహనాలను పురోహితుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనేక గ్రామ చావిడిల వద్ద జాతీయ జెండాను(National flag) ఆవిష్కరించారు. రాయపోల్ మండల కేంద్రంలో ఆనవాయితీగా వస్తున్న గ్రామ చావిడి వద్ద తాజా మాజీ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. బతుకమ్మ, దసరా, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సెలవులు రావడంతో పట్టణంలో ఉన్న వారు గ్రామాల్లోకి రావడంతో పల్లెలన్నీ జనాలతో కలకలలాడుతున్నాయి.