జహీరాబాద్ : నాలుగైదు రోజులుగా తాగునీటి కోసం గ్రామస్థులు తండ్లాడుతున్నారు. రక్షిత మంచినీటి ( Drinking water ) బోరును స్టార్ట్ చేద్దామంటే వరద నీరు బోరును చుట్టు ముట్టేసింది. దీనికి తోడుగా మిషన్ భగీరథ( Mission Bhagiratha) తాగునీరు కూడా నిలిచిపోయింది. వరద నీటిలో వెళ్లి బోరును స్టార్ట్ చేసేందుకు ఎవరు సాహసించ లేదు.
కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీదుగా మంజీర నదిలో భారీగా నీరు చేరింది. దీంతో సింగూర్ ప్రాజెక్ట్ మంజీర నది తీర ప్రాంతంలోని గ్రామాల శివారులోకి చేరింది. దీంతో సాగులో ఉన్న పంట పొలాలు, బోరు బావులు, రక్షిత మంచి నీటి పథకాలు నీటిలో మునిగిపోయాయి.
నాలుగైదు రోజులుగా వరద నీటి ఉధృత రోజురోజుకు పెరిగిపోవడంతో రక్షిత మంచి నీటి పథకాలు పనిచేయడం మానేశాయి . దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి తోడు దసరా పండగ ఉండడంతో తాగునీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్థులు బిందెడు నీళ్ల కోసం సమీపాన ఉన్న గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గురువారం వరద నీరు తగ్గిపోవడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మరికొందరు యువకులు ధైర్యం చేసి వరద నీటిలో వెళ్లి తాగునీటి పంపు సెట్‌ను స్టార్ట్ చేశారు. వరదనీటిలో మునిగిపోయిన స్టార్టర్, ఫేసులు పాడైపోవడంతో కొత్త స్టార్టర్, ఫీజులను బిగించి బోరును ప్రారంభించి, గ్రామానికి తాగునీటిని సరఫరాకు చర్యలు తీసుకున్నారు. వరద నీటిలో వెళ్లి గ్రామానికి తాగునీటి సరఫరా చేసిన వారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.