Rangareddy | రంగారెడ్డి, మార్చి 6 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపోయాయి. ఈ బోర్లకింద ఉన్న పంటపొలాలు ఎండిపోతున్నాయి. అలాగే, గ్రామాల్లో మిషన్ భగీరథకు తోడుగా ఉన్న బోరుబావులు కూడా ఎండిపోతున్నాయి. దీంతో జిల్లా వాసులు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో ఇప్పటికే సుమారు 15 వేల పైచిలుకు బోర్లు ఎండిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. బోర్లు ఎండిపోవటంతో కొత్తబోర్లు వేయటానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తబోర్లు వేసినప్పటికి కూడా నీరు రావటంలేదు. ఒకొక్క రైతు 800 నుంచి 1000ఫీట్లలోతు బోర్లు వేసినా నీరు పైకిరాని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కాలంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోవటం వలన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు పూర్తిగా ఎండుముఖం పట్టాయి. దీంతో ప్రతినెల భూగర్భజలాలు తగ్గుతూనే ఉన్నాయి.
పంటలను కాపాడుకునేందు కోసం కొత్తబోర్లు..
ఉన్నబోర్లు ఎండిపోవటంతో పంటపొలాలు కూడా మొత్తం ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంట పొలాలను కాపాడుకోవటం కోసం రైతులు పెద్ద ఎత్తున కొత్తబోర్లు వేస్తున్నారు. ముఖ్యంగా భూగర్భజలాలు అడుగంటడంతో ఎనిమిది వందల నుంచి వెయ్యిఫీట్ల లోతు వేస్తే కూడా నీరురాని పరిస్థితి ఉంది. దీంతోఒకొక్క రైతు మూడు నుంచి నాలుగు బోర్ల వరకు వేస్తున్నారు. ఒకొక్క బోరుకు సుమారు లక్షరూపాయల వరకు ఖర్చు అవుతోంది. అయినప్పటికి కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. రైతులు పెద్ద ఎత్తున కొత్తబోర్లు వేస్తుండటంతో బోరు బండ్ల యాజమానులు కూడా రేట్లు పెంచారు. అయినప్పటికీ పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్త బోర్లు వేయటాన్ని ఆపటంలేదు.
అప్పుల పాలవుతున్న అన్నదాతలు
పూర్తిగా అడుగంటిపోయిన పాతాల గంగను పైకి తీసుకురావడం కోసం అన్నదాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నబోర్లు ఎండిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు కొత్తబోర్లను వేస్తున్నారు. ఒకొక్కరైతు రెండు నుంచి మూడు బోర్ల వరకు వేస్తున్నారు. బోర్లు వేయటం కోసం సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఖర్చుచేస్తున్నారు. అప్పులుచేసి బోర్లు వేసినప్పటికీ నీరు రాకపోవటంతో అన్నదాతలు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల తదితర మండలాల్లో వరిపంటలు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయి. ఈ మండలాల్లో కొత్తబోర్లు వేసేందుకు రైతులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో భూగర్భజలాల నీటిమట్టం..
2023ఫిబ్రవరిలో 6.91శాతం
2025 జనవరిలో 10.13శాతంకు పడిపోయింది.
2025 ఫిబ్రవరిలో 2.93 శాతంకు పడిపోయింది